
ఆధార్ కార్డు లేకుండా నేటి రోజుల్లో ఏ సేవనైనా పొందడం దాదాపు అసాధ్యంగా మారింది. విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు, పరీక్షలు, స్కాలర్‌షిప్‌లు ఇలా ప్రతి దశలో ఆధార్ కీలకంగా మారింది. అయితే ఆధార్‌లో చిన్న మార్పులు, అప్డేట్స్ కోసం కేంద్రాలకు వెళ్లాలంటే ముందస్తు అపాయింట్‌మెంట్, పొడవాటి క్యూ, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి విద్యార్థులు ఆధార్ రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్యాంపుల ద్వారా స్కూల్ ప్రాంగణంలోనే ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.
విద్యాశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులకు మొదటి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌ను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో వేలిముద్రలు, కంటి రేటినల్ స్కాన్ వంటి వివరాల నమోదు ఉంటుంది. అయితే రెండవ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలంటే మాత్రం రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే రూ.75 ఫీజు విధించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు ఎప్పుడు, ఏ పాఠశాలలో నిర్వహించబడతాయన్న పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే జిల్లా విద్యాశాఖ అధికారి లేదా మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పిల్లలను తీసుకుని ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడే సమస్య ఇక ఉండదని, పాఠశాలలలోనే ఈ సేవలు లభించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తాజాగా సరికొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్‌తో ఆధార్‌కు సంబంధించిన అనేక సేవలు మరింత ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఈ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్‌ను క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు.
కొత్త ఆధార్ యాప్‌లో చిరునామా, మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఆధార్ కాంటాక్ట్ కార్డ్ ఫీచర్ ద్వారా అత్యంత గోప్యంగా కాంటాక్ట్ వివరాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. ఎవరికైనా ఆధార్ షేర్ చేసినప్పుడు మొత్తం వివరాలు కనిపించకుండా, అవసరమైన సమాచారం మాత్రమే చూపించే విధంగా ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇంకా ఈ యాప్ ద్వారా ఐదుగురి వరకు ప్రొఫైల్ వివరాలను ఒకే ఖాతాలో క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకే యాప్‌లో నిర్వహించుకోవచ్చు. పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు, కొత్త ఆధార్ యాప్ వంటి నిర్ణయాలతో ఆధార్ సేవలు మరింత సులభంగా, ప్రజలకు చేరువవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: నేడు వనప్రవేశం.. ముగియనున్న మేడారం మహాజాతర





