
రూ.10 లక్షలకు బంగారు ఆభరణాల విక్రయం
పోలీసుల వివరాల ప్రకారం.. కొల్హాపూర్ జిల్లా సతావే గ్రామానికి చెందిన 19 ఏళ్ల సమర్ చవాన్ తన ఇంటికి సమీపంలో నివసించే బాబాయ్ ఉమేష్ మారుతి చవాన్ ఇంట్లో నెల రోజుల క్రితం చోరీకి పాల్పడ్డాడు. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. అనంతరం స్థానిక స్వర్ణకారుడు సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో వాటిని రూ.10 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ఆ డబ్బుతో కొత్త మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేశాడు.
వాహనం పూజకు బాబాయ్‌కు ఆహ్వానం
కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకొచ్చిన సమర్.. దాని పూజా కార్యక్రమానికి తన బాబాయ్ ఉమేష్‌ను కూడా ఆహ్వానించాడు. పూజ సందర్భంగా ధరించేందుకు ఉమేష్ తన భార్యకు చెందిన బంగారు నగల కోసం వెతకగా అవి కనిపించలేదు. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో తన అమ్మమ్మకు చెందిన ఆభరణాలు అలాగే ఉండగా, ఉమేష్, ఆయన భార్యకు చెందిన నగలు మాత్రమే కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు అందింది.
అనుమానంతో విచారణ.. ఇద్దరి అరెస్ట్
సమర్ అకస్మాత్తుగా ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. అతడికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టారు. దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో సమర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో అతడు చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వర్ణకారుడు సంగ్రామ్ మోరేను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
also read : కృష్ణా నదిలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు యువకులు మృతి