
Gold Rate: దేశీయ బంగారం మార్కెట్లో ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడుల కోసం బంగారాన్ని అత్యంత సురక్షిత ఎంపికగా భావించే భారతీయులు ఈసారి కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. దాంతో 2024-25 కాలంలో దేశీయంగా గోల్డ్ రేట్లు అసాధారణ వేగంతో పెరిగి మొత్తం 67 శాతం పెరుగుదల నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం భయాలు, జియోపాలిటికల్ పరిస్థితులు, రూపాయి-డాలర్ మార్పు ఇలా అన్ని కలిసి బంగారాన్ని మళ్లీ అత్యంత డిమాండ్ ఉన్న ఆస్తిగా నిలబెట్టాయి.
డిసెంబర్ 11 ఉదయం దేశంలో ప్రధాన నగరాల వ్యాప్తంగా గోల్డ్ ధరలు కొత్త స్థాయిలను తాకాయి. దిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,30,470 చేరి చరిత్రాత్మక గరిష్టం నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధరలు రూ.1,30,320 వద్ద కొనసాగుతున్నాయి.
రూపాయి బలహీనపడటం కూడా దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలను మరింత పెంచింది. నిపుణులు చెబుతున్నదేమిటంటే.. వచ్చే సంవత్సరం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేకపోతే లేదా రూపాయి విలువ మరింత దిగజారితే 2026 నాటికి బంగారం మరిన్ని 5 శాతం నుంచి 16 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో కూడా గోల్డ్ ధరలు దాదాపు 60 శాతం వరకూ ఎగబాకడం ఈ అంచనాలను మరింత బలపరుస్తోంది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు కూడా గణనీయమైన పెరుగుదలతో కొనసాగుతున్నాయి. దిల్లీ, లక్నోలో 24 క్యారెట్ ధర రూ.1,30,470 చేరగా, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ధర రూ.1,30,320గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర కూడా నగరం వివరిస్తే స్వల్ప తేడాతో రూ.1,19,460 నుంచి రూ.1,19,610 మధ్య కొనసాగుతోంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి సందర్భాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ధరలు వినియోగదారులకు భారంగా మారాయి.
బంగారంతో పాటు వెండి ధరల్లోనూ అసాధారణ పెరుగుదల గమనించవచ్చు. డిసెంబర్ 11 నాటికి వెండి ధర కిలోకు రూ.1,99,100 చేరి మరోసారి కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధరలు 114 శాతం పెరగడం విశేషం. పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం, అంతర్జాతీయ డిమాండ్ అధికమవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు ఎంతగానో పెరిగినా, పెట్టుబడిదారుల ఆసక్తి మాత్రం తగ్గలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడి భద్రత, స్థిరమైన లాభాలు, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడుల నుంచి రక్షణ ఇవన్నీ బంగారాన్ని ప్రజలకు అత్యంత నమ్మదగిన ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి. రాబోయే నెలల్లో ధరలు ఏ దిశలో సాగినా, బంగారం పెట్టుబడుల్లో పెద్ద మార్పులు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.
ALSO READ: Tollywood: ‘ఈ వయసులో అవసరమా?’ అన్న ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన ప్రగతి





