Gold Set to Cross Rs. 2 Lakh: పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు, ఔన్సు గోల్డ్ విలువ తొలిసారి 5000 డాలర్ల మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్వే ప్రకారం ఈ ఏడాది ఔన్సు బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 7000 డాలర్ల దాటే అవకాశం ఉన్నట్లు తేలింది.
జస్ట్ రెండేళ్లలో బంగారం ధర రెట్టింపు
మనదేశంలో బంగారం ధర 2007లో తొలిసారి తులం రూ.10 వేలకు చేరింది. అది రూ.20 వేల మార్కుకు చేరడానికి దాదాపు 3-4ఏళ్లు పట్టింది. అక్కణ్నుంచీ రెట్టింపు కావడానికి.. అంటే రూ.40 వేల మార్కు దాటడానికి తొమ్మిదేళ్లు పట్టింది. రూ.80 వేల మార్కు చేరడానికి ఐదేళ్లు పట్టింది. రూ.80 వేల నుంచి రెట్టింపు కావడానికి.. అంటే రూ.1.6 లక్షల మార్కుకు చేరడానికి పట్టిన సమయం కేవలం 1-2 ఏళ్లు కావడం విశేషం.
బంగారాన్ని ఎలా లెక్కిస్తారంటే?
సాధారణంగా మనం బంగారాన్ని తులాల్లో లెక్కిస్తాం. అంతర్జాతీయ మార్కెట్లో ఆ లెక్క ఔన్సుల్లో.. విలువ డాలర్లలో ఉంటుంది. ఔన్సు అంటే 28.3495 గ్రాములు. అయితే, బంగారం, వెండి వంటి లోహాలను లెక్కించేటప్పుడు మామూలు ఔన్సు కాకుండా.. ట్రాయ్ ఔన్సుల్లో లెక్కిస్తారు. ఒక ట్రాయ్ ఔన్సు 31.10.35 గ్రాములు. సోమవారం నాటి ధర 5000 డాలర్లంటే దాదాపుగా రూ.4.6 లక్షలు. అదే 7000 డాలర్లకు పెరిగితే.. అప్పుడు తులం బంగారం ధర.. రూ.2.2 లక్షలకు చేరుతుంది.
బంగారం పెరుగుదలకు కారణం ఏంటంటే?
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. డాలర్లలో ఉన్న రష్యా విదేశీ నిల్వలను స్తంభింపజేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక భయం పుట్టింది. తమపై కూడా ఇలాగే ఆంక్షలు విధిస్తే పరిస్థితేంటి? అనే భయంతో పలు దేశాల బ్యాంకులు డాలర్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లను ప్రారంభించాయి. అప్పుడు మొదలైన పుత్తడి ధరల అసాధారణ దూకుడు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విపరీతమైన నిర్ణయాలతో మరింతగా పెరిగింది. బంగారం ధరలు నానాటికీ ఎగబాకుతుండడంతో.. పెట్టుబడిదారుల్లో పుత్తడి కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది.





