
Gold and silver: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులు, అప్పుడప్పుడు సంభవించే అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెట్టుబడిదారులను తమ పోర్ట్ ఫోలియోలను మరింత జాగ్రత్తగా రూపొందించేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు పెట్టుబడిదారుల కోసం మళ్లీ కీలకమైన, భద్రమైన వ్యూహాత్మక ఆస్తులుగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం సహజంగానే మధ్యకాలం నుండి దీర్ఘకాలం వరకు పెట్టుబడులను రక్షించే శక్తిని కలిగి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడో, గ్లోబల్ మార్కెట్లలో అశాంతి నెలకొన్నప్పుడో, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పెరిగినప్పుడో బంగారం పెట్టుబడిదారులకు రక్షణగోడగా నిలుస్తోంది.
ఇప్పటికే బంగారంలో పెట్టుబడులు పెట్టినవారు ఆ ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించడం మంచిదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సూచించింది. కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారు ఒక్కసారిగా పెద్ద మొత్తాలను పెట్టకూడదని, చిన్న మొత్తాలతో SIP రూపంలో శ్రద్ధగా, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోవడం భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తుందని సలహా ఇస్తోంది. విలువకర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన రొనక్ మోర్జేరియా కూడా ఇదే మాట చెప్పారు. చిన్న మొత్తాల SIPలను 5 నుండి 7 సంవత్సరాలపాటు కొనసాగిస్తే గణనీయమైన కార్పస్ నిర్మించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మొత్తం ఆదాయంలో 10 శాతం దాటకుండా బంగారం పెట్టుబడులను పరిమితం చేసుకోవాలన్నారు.
వెండి విషయానికి వస్తే, అది కూడా ఒక మంచి పెట్టుబడి అవకాశమే అయినప్పటికీ, ఇది బంగారం కంటే ఎక్కువ వోలటైల్ లోహం. ధరలు వేగంగా పైకి పోవచ్చు, అలాగే అదే వేగంతో క్రిందికి పడిపోవచ్చు. కాబట్టి వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు తప్పనిసరిగా రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు చాలా తరచుగా మారుతున్నందున, సరైన సమయం గుర్తించకుండా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే నష్టాల ప్రమాదం ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. అందుకే బంగారం, వెండిలో కలిపి మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. ఈ రెండు లోహాలను ప్రధానంగా పెట్టుబడి విభజన (డైవర్సిఫికేషన్) కోసం, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి అని సూచిస్తున్నారు.
గోల్డ్ – సిల్వర్ ఇన్వెస్ట్మెంట్‌ను 5 మాటలలో ఇలా చెప్పొచ్చు..
1. బంగారంలో ఇప్పటికే పెట్టుబడి ఉంటే కొనసాగేలా ఉంచడం లేదా నెమ్మదిగా దాన్ని పెంచుకోవడం లాభదాయకం.
2. చిన్న మొత్తాలతో SIPలను ప్రారంభించాలని, కానీ దీర్ఘకాలం నిలబడే వ్యూహంతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
3. వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వోలటాలిటీకి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ రిస్క్ తీసుకోగలిగే వారు మాత్రమే దానిని పరిశీలించాలి.
4. వెండిలో పెట్టుబడి మొత్తం, బంగారంతో పోలిస్తే తక్కువగా ఉంచడం మంచిది.
5. మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఈ రెండు లోహాలకు కేటాయించకుండా జాగ్రత్తపడితే రిస్క్ తగ్గి పోర్ట్ ఫోలియో స్థిరంగా ఉంటుంది.
ALSO READ: Egg: గుడ్డు మాంసాహారమా లేక శాఖాహారమా..?





