
Election Commission: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే వాటిలో నిజం లేనట్టుగానే భావించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలని.. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 7 రోజుల్లోగా అఫిడవిట్ ఇవ్వకపోతే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని భావించాల్సి ఉంటుందన్నారు. డబుల్ ఓటింగ్‌పై ఆరోపణలను ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు సరికాదన్నారు.
అన్ని పార్టీలు సమానమే!
ఇక తమకు అన్ని పార్టీలు సమానమేనని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు. తమకు అన్ని పార్టీలు సమానమేనని, పార్టీల సిద్ధాంతాలు, అఫిలియేషన్‌తో తమకెలాంటి సంబంధం ఉండదన్నారు.
మరో 15 రోజులు గడువు
బిహార్ ముసాయిదా ఎన్నికల జాబితాలో సవరణలకు మరో 15 రోజులు గడువు ఉందని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బీహార్ ఎస్ఐఆర్ కింద ముసాయిదా ఎన్నికల జాబితాపై ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి అనుమానులు ఉన్నా తమను సంప్రదించవచ్చన్నారు. మరోవైపు బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, తగిన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈసీ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివరించారు.
Read Also: భారత్ కు చైనా విదేశాంగ మంత్రి.. పర్యటన వెనుక కారణం ఇదే!