Gas Booking: దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల వినియోగంలో పారదర్శకత పెంచడం, అక్రమ సరఫరాలను అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా వ్యవస్థలో అవకతవకలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో వాటిని కట్టడి చేయడానికి కేంద్రం కఠిన చర్యలకు దిగింది. గృహ వినియోగానికి ఇచ్చే గ్యాస్ సిలిండర్లు ఇతర అవసరాలకు మళ్లించబడకుండా ఉండేందుకు కొత్త నియమాలను అమలు చేయాలని అధికారులకు సూచించింది. ఈ చర్యల భాగంగా గ్యాస్ బుకింగ్ విధానంలో మార్పులు, డెలివరీ సమయంలో కఠిన ధృవీకరణ ప్రక్రియలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్స్ వెయింటింగ్ పీరియడ్‌ను పెంచగా.. సిలిండర్లను కేవలం గృహ అవసరాలకే వినియోగించేలా సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయించే ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. అధికార యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు ఇస్తూ అక్రమ సరఫరా వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ చర్యల నేపథ్యంలో పోలీసులు, సంబంధిత అధికారులు అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లపై దాడులు నిర్వహిస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అనధికారికంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో గ్యాస్ సరఫరా వ్యవస్థలో క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు డెలివరీ చేసే సమయంలో ఒక ప్రత్యేక ధృవీకరణ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానం ప్రకారం వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే అతని నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ పంపబడుతుంది. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఖ్యను వినియోగదారుడు చెప్పాల్సి ఉంటుంది. ఆ సంఖ్యను నమోదు చేసిన తర్వాతనే సిలిండర్ అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వినియోగదారుడి వద్దకు వచ్చే బిల్లులో ఉన్న సంఖ్య, మొబైల్‌కు వచ్చిన సంఖ్య రెండూ ఒకేలా ఉన్నాయో లేదో కూడా పరిశీలించి తరువాతే సిలిండర్ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం అమలులోకి రావడంతో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
వినియోగదారులు కూడా ఈ ప్రక్రియను జాగ్రత్తగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చే సంఖ్యను తప్పకుండా భద్రపరచుకోవాలని సూచించారు. ఆ సంఖ్య లేకపోతే గ్యాస్ సిలిండర్ అందుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గ్యాస్ బుక్ చేసిన ప్రతి వినియోగదారుడు ఆ సంఖ్యను గమనించి డెలివరీ సమయంలో అందుబాటులో ఉంచుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి విధానం ఉన్నప్పటికీ అనేక ఏజెన్సీలు దాన్ని కచ్చితంగా పాటించలేదని అంటున్నారు. ఇప్పుడు మాత్రం ఈ విధానాన్ని పూర్తిగా తప్పనిసరి చేయడంతో డెలివరీ ప్రక్రియ కొంత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారులు ఇంట్లో అందుబాటులో లేకపోవడం, మొబైల్ కాల్‌లకు స్పందించకపోవడం వంటి కారణాల వల్ల డెలివరీ సిబ్బంది కొంతసేపు వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు వినియోగదారుడిని సంప్రదించి సంఖ్యను తెలుసుకోవడం కోసం పలుమార్లు కాల్ చేయాల్సి వస్తుండటంతో సమయం ఎక్కువగా తీసుకుంటోందని పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల గ్యాస్ డెలివరీలో కొద్దిపాటి జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసిన తర్వాత సాధారణంగా 2 నుండి 3 రోజుల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ జరుగుతోందని వారు తెలిపారు. గిడ్డంగుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించారు. కొత్త విధానం వల్ల కొంత సమయం పట్టినా దీని ద్వారా అక్రమ సరఫరాలు తగ్గి గ్యాస్ వినియోగ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: మన పూర్వీకుల జీవన విధానం ఎందుకు ప్రత్యేకం
