తెలంగాణ

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద.. సాగర్ 14 గేట్ల ద్వారా నీటి విడుదల!

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అటు గోదావరి ప్రాజెక్టులకు మాత్రం అంతంత మాత్రంగానే వరద వస్తోంది. కృష్ణా బేసిన్‌ లో శ్రీశైలం ప్రాజెక్టుకు1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా, 1.74 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు.

14 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

అటు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ కు 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో ఔట్‌ ఫ్లో ఉంది. సాగర్‌ 14 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు 1.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.67 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 15,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా… 19 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాలకు 1.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఔట్‌ఫ్లో 68 వేల క్యూసెక్కులుగా ఉంది.

గోదావరి బేసిన్ లో వరద అంతంత మాత్రమే!

ఇక గోదావరి బేసిన్‌ లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో రాగా.. ఔ ట్‌ఫ్లో 4,733 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో రాగా.. ఔట్‌ ఫ్లో 10,578 క్యూసెక్కులుగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదవ్వగా.. 28,857 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు నిర్మల్‌ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కులను విడిచిపెట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు.

Read Also: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button