తెలంగాణ

కుండపోత వర్షాలు, నలుగురు మృతి, ఆరుగురు గల్లంతు!

Heavy Rains: భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. మెదక్‌ జిల్లా హవేళీ ఘనపూర్‌ మండలం రాజ్‌పేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆటోలో మెదక్‌ వెళ్తుండగా మార్గమధ్యంలో నక్కవాగు దాటుతున్న క్రమంలో వరద ఉధృతి ఎకువై ఆటోతోపాటు కొట్టుకుపోయారు. కరెంటు స్తంభాన్ని పట్టుకుని కాపాడాలని వేడుకున్నారు. వరద ఉధృతి మరింత పెరగడంతో కరెంటు స్తంభం కూడా కొట్టుకుపోవటంతో వారు మరణించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో గోడ కూలి యువకుడు మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొరిగూడకు చెందిన గంగాధర్‌(26) కూలికి వెళ్లి తిరిగి వస్తూ కాలువలో పడి మరణించాడు.

అటు వికారాబాద్‌ జిల్లాలోని కోటపల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఒకరు గల్లంతయ్యారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని ఎస్సారెస్పీ కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. కామారెడ్డిలోని సరంపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలో చిక్కుకున్న వందమంది విద్యార్థులను అధికారులు కాపాడారు. నిర్మల్‌ మునిపెల్లిలో పశువుల కాపరి వాగులో చిక్కుకుపోగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం కాపాడింది.  సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. నర్మాలలో మానేరువాగు ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు రైతులను ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు. వీరు బుధవారం మధ్యాహ్నం పశువులను మేపేందుకు వెళ్లి వాగులో చిక్కుకొని ఎత్తయిన గడ్డమీద ఉండిపోగా డ్రోన్‌ ద్వారా అధికారులు ఆహారం అందించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్ లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button