
US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనం అయ్యింది. కొంపల్లికి చెందిన శ్రీవెంకట్, తేజస్విని దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు సిద్దార్థ్, మ్రిదా ప్రాణాలు కోల్పోయారు. వెంకట్, తేజస్వి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి డల్లాస్ లో ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు. తాజాగా వెంకట్ అట్లాంటాలోని తన అక్క ఇంటికి భార్య, పిల్లలతో కలిసి వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తిరిగి వస్తుండగా, గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చిన మినీ ట్రక్ వారి కారుకు డ్యాష్ ఇచ్చింది. ట్రక్ వేగంగా వచ్చి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
ఎముకల గూళ్లుగా మారిన కుటుంబ సభ్యులు
ఈ ప్రమాదంలో వెంకట్ కుటుంబానికి చెందిన నలుగురి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. అధికారులు వారి ఎముకలు సేకరించి, డీఎన్ఏ ద్వారా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ రాంగ్ సైడ్ లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
వెంకట్ కుటుంబం మృతితో హైదరాబాద్ లోని వారి తల్లిదండ్రులు శోకసముద్రంలో ముగినిపోయారు. వెంకట్ తల్లిదండ్రులు పశుపతి, గిరిజ హైదరాబాద లోని తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. ఏడాది క్రితమే వారు కూడా తన కొడుకు దగ్గరికి వెళ్లారు. డల్లాస్ లోనే ఉంటున్నారు. తేజస్వి తల్లిదండ్రులు రవి, అనిత కొంపల్లిలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీలో ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే వాళ్లు అమెరికాకు బయల్దేరి వెళ్లారు. అటు తేజస్వి అన్నయ్య కూడా అమెరికాలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి – గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ సమీక్ష