
ఖమ్మం,క్రైమ్ మిర్రర్ :- ఉగాది పర్వదినం నాడు ఖమ్మం జిల్లాలో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం ప్రజలకు పాత్రికేయులకు రైతాంగ సోదరులకు తెలుగు నూతన నామ సంవత్సర ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు.ఖమ్మం జిల్లా ప్రధాన ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం క్రింద 600 కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు పూర్తి చేసి 101 కిమి కాల్వలో నీరు తీసుకొని వచ్చామని, ఆరు నెలల వ్యవధి కాలంలో 1500 క్యూసెక్కుల పరిమాణంతో రాజీవ్ కెనాల్ 9 కిలోమీటర్ల మేరకు పూర్తి చేసి సాగర్ కాల్వకు లింక్ చేసి మొన్న సాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడు వైరా తల్లాడ పెనుబల్లి వెంసూర్ మండలాలతో పాటు ఎగువన పినపాక కొత్తగూడెం అశ్వరావుపేట నియోజకవర్గాల్లోని పంటలు కూడా కాపాడుకోవడం జరిగిందని అన్నారు.
కాల్వల నిర్మాణ పనుల సవరణ అంచనాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీని ద్వారా పినపాక కొత్తగూడెం అశ్వారావుపేట వైరా నియోజకవర్గాల్లో సుమారు లక్షా 20 వేల ఎకరాలు, సాగర్ క్రింద లక్షా 20 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
భద్రాద్రి దేవాలయ అభివృద్ధికి టెంపుల్ చుట్టూ భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉందని, ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు చెప్పినట్లు అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. సీఎం మొదటి దశ క్రింద భూసేకరణకు 34 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.సింగరేణి ఆధ్వర్యంలో గతంలో నడిచే మైన్స్ కాలేజి ని ఇంజనీరింగ్ కళాశాలగా మార్చామని, జియోలజి సంబంధించి విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరగా సీఎం నిపుణులతో చర్చించి కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జిల్లా ప్రజలకు, రాష్ట్ర, దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయని అన్నారు.కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు.
పాండురంగాపురం నుంచి విష్ణుపురం రైల్వే లైన్ మంజూరు కావడం జరిగిందని, ఇందులో భాగంగా పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ వేస్తే భద్రాచలంకు రైల్వే కనెక్టివిటి వస్తుందని అన్నారు. అమరావతి- భద్రాచలం జాతీయ రహదారి పనులు పూర్తి చేసుకున్నామని హైదరాబాద్ – ఇల్లెందు – భద్రాచలం జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని, భద్రాచలం- ఏటూరు నాగారం మీదుగా మహారాష్ట్రకు కూడా జాతీయ రహదారి వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు.
ఆగస్టు 15 నాటికి ఖమ్మం నుంచి రాజమహేంద్రవరం జాతీయ రహదారి పనులు పూర్తి అవుతాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాలను కవర్ చేస్తూ జాతీయ రహదారి నిర్మాణాలకు ప్రణాళికలు చేశామని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయితే ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డుగా ఉపయోగపడుతుందని, ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయని అన్నారు. ఉగాది పర్వదినాన ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ఉంటుందని అన్నారు. రైతులు నిర్భయంగా ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు 3 సంవత్సరాలలో ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పేదలకు ఉపయోగపడే విధంగా సన్న బియ్యం ఉగాది నుండి ఇవ్వాలని నిర్ణయించా మన్నారు.గ్రానైట్ పరిశ్రమ మీద ఆధారపడే యువకులకు లాభం చేకూర్చేలా నిబంధనలు, మార్గదర్శకాలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పాత నేలకొండపల్లి రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 20 కోట్ల మంజూరు జరిగిందని అన్నారు.సన్నబియ్యం ధాన్యానికి బోనస్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిందని, ఎక్కడైనా గ్యాప్ ఉండి రైతులకు రాకపోతే కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. మార్చి నెలాఖరు నాటికి రైతు భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డిఓ నరసింహరావు, నేషనల్ హై వే మేనేజర్ దివ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.