
-
పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అవస్థలు
-
భూమి, నగలు తాకట్టుపెట్టి గ్రామంలో అభివృద్ధి పనులు
-
ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న రూ.11లక్షల బకాయిలు
-
అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించని వైనం
-
మనస్థాపంతో గడ్డిమందు తాగిన సర్పంచ్ భర్త
క్రైమ్ మిర్రర్, కరీంనగర్: తెలంగాణలో మాజీ సర్పంచ్‌ల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల బకాయిలు రాకపోవడంతో అరిగోసలు పడుతున్నారు. కొంతమంది సొంత భూములు అమ్ముకొని అప్పులు చెల్లిస్తే… భార్యపిల్లల నగలు తాకట్టుపెట్టి మరికొందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అప్పుల బాధలు భరించలేక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రవి సొంత భూమిని, బంగారాన్ని తాకట్టుపెట్టి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం నుంచి రూ.11లక్షల బకాయిలు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా నిధులు విడుదల చేయలేదు. బిల్లులు మంజూరు అవకపోవడం, అప్పులు ఇచ్చినవారికి సమాధానం చెప్పలేక రవి మనస్తాపానికి గురయ్యాడు. దీంతో గడ్డి మందు తాగి రవి ఆత్మహత్యకు యత్నించాడు.