క్రైమ్ మిర్రర్, అమరావతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనకు గుడ్ బై చెబుతారా? అక్కడ ఆయనకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కడం లేదా? అందుకే పునరాలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. నామినేటెడ్ పదవులు దక్కుతాయని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సొంత జిల్లా ప్రకాశం లో కూడా జనసైనికులు బాలినేనిని గుర్తించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. కూటమి వేదికల్లో కూడా బాలినేని ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఉన్నట్టుండి ఆయన తన సొంత నియోజకవర్గం ఒంగోలుకు వచ్చారు. టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై యుద్ధం ప్రకటించారు. దీంతో బాలినేని యూటర్న్ తీసుకుంటున్నారు అన్న ప్రచారం నడుస్తోంది.
ఓటమితో కీలక నిర్ణయం..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు బాలినేని. ఆయనపై టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్ధన గెలిచారు. అయితే అక్కడకు కొద్ది కాలానికే బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై అనేక రకాల విమర్శలు చేశారు. తన సమీప బంధువైన వైవి సుబ్బారెడ్డి పై తరచూ విరుచుకుపడుతుంటారు. ఇంత చేస్తున్నా టిడిపి కూటమిలో బాలినేని కి ప్రాధాన్యం పెరగడం లేదు. జనసేన పరంగా ఎటువంటి పదవి దక్కలేదు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనకు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.. ఏకంగా టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై విమర్శలు చేస్తుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమీప బంధువు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కి సమీప బంధువు. వై వి సుబ్బారెడ్డి సోదరిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివాహం చేసుకున్నారు. వై వి సుబ్బారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి స్వయానా తోడల్లుడు. అందుకే బాలినేనికి వైయస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. 2004లో యువజన కాంగ్రెస్ లో కొనసాగుతున్న బాలినేనికి టికెట్ ఇచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు శ్రీనివాస్ రెడ్డి. 2009లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు బాలినేని. దీంతో రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే తో పాటు మంత్రి పదవిని వదులుకొని మరి జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు బాలినేని. 2014లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి బాలినేనికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేనికి ఏకంగా తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అప్పటినుంచి నిత్యం అలకపాన్పు ఎక్కుతూ వచ్చారు.
గౌరవం దక్కకపోవడంతో..
ఒకానొక దశలో 2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కదని ప్రచారం నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు. ఓటమి తర్వాత బాలినేని స్వరంలో మార్పు వచ్చింది. అసంతృప్త స్వరం వినిపించింది. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోయేసరికి.. గౌరవం లేని చోట ఉండడం శ్రేయస్కరం కాదని భావించి పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. అయితే ఏడాదిన్నర దాటుతున్న జనసేనలో సరైన గుర్తింపు దక్కడం లేదు. అధికార కూటమిలో ఉన్న ఎక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కనీస ఆహ్వానం లేదు. ఈ క్రమంలోనే బాలినేని ఒంగోలు నియోజక వర్గంలో అధికార టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన పై విమర్శలు చేస్తున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో బాలినేని జనసేనకు గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
