
-
18 మంది బాలికలకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
-
మాపటి బువ్వ పొద్దున్న పెట్టడమే కారణమా?
-
కోడిగుడ్ల కోసం ఘోరం!
-
విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నాలు..!
-
పిల్లల తల్లితండ్రుల వల్లే జరిగిందని సమాధానం
-
చేసిన తప్పును దాటవేసేందుకు కుటిలయత్నాలు!
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: మండలంలోని మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 13 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, ముగ్గురికి విరేచనాలు, ఇద్దరికి వాంతులు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి మిగిలిన భోజనాన్ని, కోడిగుడ్లని మరుసటి రోజు పిల్లలకు పెట్టడం వల్లే సమస్య ఏర్పడిందని చర్చించుకుంటున్నారు. ఒకే సారి 18 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురికావడంతో, మండలంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం బయటికి పొక్కకుండా, హాస్టల్ నిర్వాహకులు జాగ్రత్తపడుతూ, నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఉన్న గురుకులాలలో ఫుడ్ పాయిజన్ సమస్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై చెలగాటమాడుతున్నారని నిపుణులు మండిపడుతున్నారు. హాస్టళ్లకు సరఫరా చేసే గుడ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్దాల్లో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. జరిగిన తప్పిదాన్ని మళ్ళీ జరగకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన హాస్టల్ నిర్వాహకులు, పిల్లల తల్లితండ్రులే తప్పు చేశారంటూ వారిపైకి నెట్టేయ్యడం విడ్డూరమంటున్నారు.
ఆదివారం రాత్రి మిగిలిన ఆహార పదార్దాలను, సోమవారం వేడి చేసి పిల్లలకు పెట్టడంతోనే ఫుడ్ పాయిజన్ కావొచ్చని స్థానికులు అనుకుంటున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలకు ఏమైనా అయితే ఊరుకునే పరిస్థితి లేదంటున్నారు.
విద్యార్థులు అస్వస్థతకు గురికావటం నిజమే-ఎంఈవో మర్రిగూడ
18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవటం నిజమేనని ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. విషయం తెలియగానే హాస్టల్‌ని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తీసుకున్నామన్నారు. ఆదివారం పిల్లలకు పెట్టే చికెన్ వల్లే సమస్య తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.