
Israel Attacks on Gaza: హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ దాడులకు దిగింది నాజర్ ఆస్పత్రిపై జరిపిన దాడుల్లో ఐదురుగు జర్నలిస్టులు సహా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో ఒకరు రాయిటర్స్ కు చెందిన హతేమ్ ఖలీద్ తో పాటు ఓ ఫొటోగ్రాఫర్ ఉన్నట్లు వెల్లడించారు. మరో లోకల్ రిపోర్టర్ కూడా చనిపోయినట్లు తెలిపారు. 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 62 వేలు దాటింది. లక్షలాది మంది గాయపడ్డారు. ఇక ఈ యుద్ధంలో సుమారు 200 మందికిపైగా మీడియా ప్రతినిధులు చనిపోయారు.
గాజాలో భయంకరమైన కరువు
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని వెల్లడించింది. ఇక్కడ 5 లక్షల మందికిపైగా తినడానికి తిండి లేక ఆకలితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ కరువు పూర్తిగా నిరోధించగలిగినదేనని వివరించింది. ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్నందు వల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదన్నారు. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, గాజాలో కరువు లేదని చెప్పింది. రోమ్ నుంచి పని చేస్తున్న ఐపీసీ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసినదని ఆగ్రహం వ్యక్తం చేసింది.