
వడగళ్ల వానలు కురవడం సాధారణమే. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో ఆకాశం నుంచి చేపలు పడటం మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ ఇటీవల అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపలు ఆకాశం నుంచి పడటం సంచలనంగా మారింది. ఈ వింత ఘటనను అక్కడి ప్రజలు కేవలం ఆశ్చర్యంగా మాత్రమే కాకుండా, ఒక ప్రత్యేక వేడుకలా కూడా జరుపుకుంటున్నారు. అసలు చేపలు ఆకాశం నుంచి ఎలా పడతాయి అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు.
చేపలు ఆకాశంలో ఉండవని, అవి వర్షంలా పడటం వెనుక ప్రకృతి శక్తుల పాత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి వనరులపై ఏర్పడే శక్తివంతమైన సుడిగాలులు, సుడిగుండాలు నీటిలో ఉన్న చేపలను తమతోపాటు గాలిలోకి లాగుతాయి. ఆ తర్వాత గాలి వేగం తగ్గిన సమయంలో అవి భూమిపై పడిపోతాయి. ఈ పరిణామమే మనకు చేపల వర్షంలా కనిపిస్తుందని శాస్త్రవేత్తల వివరణ.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న టెక్సార్కానా ప్రాంతంలో ఇటీవల పెద్ద సంఖ్యలో చేపలు ఆకాశం నుంచి కురిశాయి. ఒక్కసారిగా రోడ్లపై, ఇళ్ల ముందు చేపలు పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి ఈ చేపలు సమీపంలోని నీటి వనరుల నుంచి సుడిగాలుల ద్వారా పైకి లాగబడ్డాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చేపలతోపాటు కప్పలు, పీతలు, చిన్న పాములు వంటి జీవులు కూడా ఇలా భూమిపై పడిన ఘటనలు ఉన్నాయి.
ఇలాంటి జంతు వర్షాలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో గతంలోనూ నమోదయ్యాయి. కాలిఫోర్నియా, వాయువ్య సైబీరియాలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో కూడా కొన్ని అరుదైన సందర్భాల్లో చేపల వర్షం కురిసింది. 2019లో కేరళలో వర్షాకాలంలో చేపలు ఆకాశం నుంచి పడిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే 2022లో తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో చేపల వర్షం కురవడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. 2021లో ఉత్తరప్రదేశ్‌లోని పటోహి జిల్లాలో కూడా ఇలాంటి ఘటన నమోదైంది. సాధారణంగా వర్షాకాలంలోనే ఈ ప్రకృతి వింతలు ఎక్కువగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన చేపల వర్షం హోండురాస్ దేశంలోని యోరో నగరంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చేపల వర్షం కురవడం ఆనవాయితీగా మారింది. ఈ ఘటనను అక్కడి ప్రజలు పండగలా జరుపుకుంటారు. దీనిని స్థానికంగా లువియా డి పెసెస్ అని పిలుస్తారు. సాధారణంగా మే నుంచి జులై మధ్య కాలంలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ చేపల వర్షం కురుస్తుంది. భూమిపై పడిన చేపలను ప్రజలు ఏరుకుని వండుకుని తింటారు. దీంతో యోరో నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
శాస్త్రవేత్తల వివరణ ప్రకారం సముద్రాలు, మహా సరస్సులపై ఏర్పడే అత్యంత శక్తివంతమైన సుడిగుండాలు ఈ ప్రకృతి వింతకు కారణం. తక్కువ బరువున్న చేపలు, చిన్న జీవులను ఈ సుడిగుండాలు గాలిలోకి ఎత్తుకెళ్లి, గాలి బలహీనపడిన తర్వాత భూమిపై వదిలేస్తాయి. అందువల్లే మనకు ఆకాశం నుంచి చేపల వర్షం కురిసినట్లు కనిపిస్తుందని వారు చెబుతున్నారు. చేపలు స్వయంగా ఆకాశంలో ఉండవని, ఇది పూర్తిగా శాస్త్రీయ ప్రక్రియేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: అసెంబ్లీలో నిద్రపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలు (VIDEO)





