
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రేమలత వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. విధి నిర్వహణ సమయంలో యూనిఫాంలోనే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించడం, అందులో చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖ ప్రతిష్టపై ప్రభావం చూపాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా విధి వేళ పోలీస్ సిబ్బంది పూర్తిగా ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాల్సి ఉండగా, అలా కాకుండా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం అనవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
డ్యూటీలో ఉండగానే ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ప్రేమలత నెటిజన్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు డ్యూటీ సమయంలో లైవ్ చేయడం సరైందా అంటూ ప్రశ్నించగా, ఇది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, ఇక్కడ పని ఏమీ ఉండదు కాబట్టి లైవ్‌లోకి వచ్చానని ఆమె సమాధానం ఇవ్వడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది. పోలీస్ స్టేషన్‌లో పని లేదన్న భావన ప్రజల్లోకి వెళ్లడం శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నెటిజన్లు.. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ అత్యంత కీలకమని గుర్తుచేశారు. యూనిఫాంలో ఉన్నప్పుడు ప్రతి చర్య కూడా శాఖ గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని, వ్యక్తిగత వినోదం కోసం లైవ్ వీడియోలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. కొందరు అయితే, ఇలాంటి చర్యలు ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వీడియో వైరల్ కావడంతో విషయం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. డ్యూటీ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ రావడం, అదీ యూనిఫాంలో ఉండి శాఖ పనితీరుపై తేలికపాటి వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శాఖా నియమ నిబంధనలను అతిక్రమించినట్లు నిర్ధారణైతే, మహిళా కానిస్టేబుల్ ప్రేమలతపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వ్యక్తిగత స్వేచ్ఛకు, శాఖా క్రమశిక్షణకు మధ్య స్పష్టమైన గీత ఉండాలని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న చర్య కూడా పెద్ద వివాదంగా మారుతున్న తరుణంలో, పోలీస్ సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ALSO READ: పోలీసులను వదలనీ సైబర్ నేరగాళ్లు..?





