
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోక్సో చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. తన సొంత మైనర్ కుమార్తెపై పదే పదే అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసిన 47 ఏళ్ల తండ్రికి మరణశిక్ష విధిస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన నంగునేరి ప్రాంతానికి చెందిన ఓ కూలీ కుటుంబంలో వెలుగుచూసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. నిందితుడు తన 14 ఏళ్ల కుమార్తెను చాలా కాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బాలిక అనూహ్యంగా గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేయగా విషయం బయటపడింది. వెంటనే నంగునేరి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానానికి హాజరుపరిచారు.
ఈ కేసును తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ అధ్యక్షతన విచారించింది. కేసు నమోదు చేసిన 7 నెలల్లోపే విచారణ పూర్తి కావడం విశేషం. విచారణలో వైద్య నివేదికలు, డీఎన్ఏ పరీక్షలు, ఇతర శాస్త్రీయ ఆధారాలు, డాక్యుమెంటరీ సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది. ఇవన్నీ నిందితుడే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్పష్టంగా నిరూపించాయని కోర్టు పేర్కొంది.
తీర్పును వెలువరిస్తూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక తండ్రి తన సొంత కుమార్తెను పదే పదే హింసించడం అత్యంత దారుణమైన, క్షమించరాని నేరమని, ఇది కేవలం వ్యక్తిగత నేరం కాకుండా సమాజంపై జరిగిన ఘోర నేరమని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాలు సహేతుకమైన సందేహానికి అతీతంగా నిరూపితమయ్యాయని పేర్కొంటూ నిందితుడికి మరణశిక్ష విధించింది. అదనంగా రూ.25,000 జరిమానా కూడా విధించింది.
బాధిత బాలికకు న్యాయం అందించే దిశగా తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు నిదర్శనంగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పోక్సో చట్టం అమలులో కోర్టుల వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు నేరాలకు అడ్డుకట్ట వేయగలవని ఈ కేసు మరోసారి నిరూపించింది.
ALSO READ: Pavel Durov: ‘నా వీర్యం వాడుకుంటే ఖర్చులు భరిస్తా’





