
తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కన్నతండ్రి ఆరేళ్ల కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, అతడి సమాధి వద్ద చేసిన ఒక అసాధారణ చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆరేళ్ల బాలుడి సమాధి దగ్గర తండ్రి సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న కారణం తెలిసి పోలీసులు సైతం విస్మయానికి లోనయ్యారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఈ నెల 8వ తేదీన విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివసించే ఆరేళ్ల బాలుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఒక్కసారిగా కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమై, గ్రామ పొలిమేరలోని శ్మశానంలో సంప్రదాయబద్ధంగా బాలుడిని ఖననం చేశారు. అయితే బాలుడి మృతితో ఆ కుటుంబానికి మనశ్శాంతి దూరమైంది.
ఖననం అనంతరం కొద్ది రోజులకే బాలుడి తండ్రి ఓ నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు సమాధి దగ్గర సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాను అమర్చాడు. ఆ కెమెరా ద్వారా సమాధి వద్ద జరుగుతున్న ప్రతి కదలికను తన మొబైల్ ఫోన్‌లో నిత్యం గమనిస్తున్నాడు. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు ఇది గమనించి కారణం ఏమిటని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తన కొడుకును ఖననం చేసిన ప్రదేశంలో ఎవరైనా క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని తవ్వి తీసుకుపోతారేమో అన్న అనుమానమే తనను వెంటాడుతోందని బాలుడి తండ్రి చెబుతున్నాడు. గతంలో ఎక్కడో ఇలాంటి ఘటనలు జరిగాయన్న వార్తలు విని భయపడిపోయానని, అందుకే కొడుకు సమాధికి రక్షణగా సీసీ కెమెరా ఏర్పాటు చేశానని అతడు వెల్లడించాడు. ఏ క్షణంలోనైనా ఏదైనా అనర్థం జరుగుతుందేమోనన్న భయంతో నిద్రపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు స్పందించారు. కందులవారిపల్లి ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇటువంటి అపోహల వల్ల కుటుంబం మరింత మానసిక ఒత్తిడికి లోనవుతుందని, వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అయినప్పటికీ బాలుడి తండ్రి మాత్రం తన అనుమానాలను పక్కన పెట్టలేకపోతున్నాడు. కొడుకు సమాధి క్షేమంగా ఉందో లేదో రోజూ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నాడు.
ఒకవైపు కొడుకు మృతితో తల్లిదండ్రుల మనసు ముక్కలైపోతుండగా, మరోవైపు ఇలాంటి భయాలు వారిని వెంటాడడం స్థానికులను కలిచివేస్తోంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, తల్లిదండ్రుల మనస్థితి ఎంతటి ఆవేదనతో నిండిపోయిందో చెప్పే ఉదాహరణగా నిలుస్తోంది.
ALSO READ: ALERT: ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్‌లో మార్పు





