
Farting: భారతీయుల్లో గ్యాస్ సమస్య అనేది చాలా సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, సన్నగా ఉన్నవారి నుంచి లావుగా ఉన్నవారి వరకు ఎవరికైనా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పొట్ట ఉన్నవారికే గ్యాస్ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పని చేసే విధానం ఆధారంగా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయుల ఆహారంలో మసాలాలు, పప్పులు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
గ్యాస్ ఎందుకు వస్తుంది అనే విషయంలో స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అనవసరంగా భయపడుతున్నారు. అతిగా తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, వేళతప్పిన ఆహారం, శీతల పానీయాలు ఎక్కువగా తాగడం, ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడటం వంటి కారణాలు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. దీని ఫలితంగా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ గ్యాస్ కొన్నిసార్లు పొట్టలోనే ఇబ్బందిగా అనిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో వెనుక నుంచి అపాన వాయువుగా బయటకు వస్తుంది.
చాలా మంది వెనుక నుంచి గ్యాస్ విడుదల అవుతుంటే తమ ఆరోగ్యం బాగాలేదేమో అని ఆందోళన చెందుతుంటారు. కానీ వైద్యుల మాట ప్రకారం.. సహజంగా వచ్చే గ్యాస్ అనేది శరీరం సరిగ్గా పనిచేస్తోందనే సంకేతం. జీర్ణక్రియ జరుగుతున్న సమయంలో పేగుల్లో ఏర్పడే వాయువు బయటకు రావడం సహజమైన ప్రక్రియ. దీని వల్ల శరీరంపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కడుపులో భారంగా ఉన్న భావన నుంచి ఉపశమనం కలుగుతుంది.
అసిడిటీ లేదా జీర్ణ సమస్యల వల్ల వచ్చే గ్యాస్ కొంతసేపటికి తగ్గిపోతుంది. కానీ ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో సహజంగా వచ్చే గ్యాస్ గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒకటి రెండు సార్లు గ్యాస్ విడుదల అవుతుండటం ఆరోగ్యకరమైన అంశమే. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకున్న తర్వాత ఇలా జరగడం సహజమేనని చెబుతున్నారు.
అయితే ప్రతి గ్యాస్ కూడా మంచిదే అనుకోవడం తప్పు. తీవ్రమైన దుర్వాసనతో పాటు తరచూ గ్యాస్ వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాలి. ఇది జీర్ణవ్యవస్థ సరిగా పని చేయడం లేదనే సంకేతంగా భావించాలి. అధికంగా జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, మాంసాహారం తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసనతో కూడిన గ్యాస్ ఏర్పడుతుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అసలు గ్యాస్ రావడమే లేదని కొందరు చెప్పుకుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి అవసరమైన ఫైబర్ లేకపోతే గ్యాస్ సరిగ్గా విడుదల కాదు. దీని వల్ల మలబద్ధకం, పేగుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
సన్నగా ఉన్నవారిలో గ్యాస్ ఎక్కువగా వస్తుందని చాలామంది గమనిస్తుంటారు. కారణం ఏమిటంటే వారి జీర్ణక్రియ చురుకుగా పనిచేయడం. ఆహారం త్వరగా జీర్ణమై గ్యాస్ సులభంగా బయటకు వస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. అదే సమయంలో లావుగా ఉన్నవారిలో ఆహారం సరిగా జీర్ణం కాక పొట్టలోనే గ్యాస్ ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారు ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
నలుగురిలో ఉన్నప్పుడు గ్యాస్ వస్తుందేమోనని చాలామంది దాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది శరీరానికి హానికరం. గ్యాస్ బయటకు రాకుండా ఆపితే పేగుల్లో ఒత్తిడి పెరిగి నొప్పులు, వాపులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సహజంగా గ్యాస్ వస్తే దాన్ని ఆపుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ విడుదల కావడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
మొత్తంగా చూస్తే, వెనుక నుంచి గ్యాస్ రావడం అనేది చాలా సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిదే. అయితే దుర్వాసన, తీవ్రమైన నొప్పి, తరచూ ఇబ్బంది కలిగిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించడం అవసరం. సరైన ఆహారం, సమయానికి భోజనం, తగినంత నీరు, ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకుంటే గ్యాస్ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.
ALSO READ: రోడ్డుపై వెళ్లేప్పుడు కుక్కలు వెంటపడుతున్నాయా? టెన్షన్ పడకుండా ఇలా తప్పించుకోండి!





