
తెలంగాణలో మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. గోదావరి పరివాహాక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. నీళ్ల కోసం అధికారులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నీళ్లు వదలడం లేదని నీటిపారుదల శాఖ అధికారులను బంధించే వరకు రైతులు వెళుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూర మండలాల్లోని సాలూర క్యాంపు, జాడిజమాల్ పూర్, ఫతేపూర్ గ్రామాల్లో 6 వేల ఎకరాలకు నీరు అందక పొలాలు బీడు వారాయి. రైతులు ఈ విషయం అధికారులకు మొరపెట్టుకోగా సాలూర క్యాంపు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపేందుకు వచ్చారు. ఈ విషయంలో రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు.సమాచారం అందుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి అధికారులను విడిపించారు.