
Fancy Number Plate: చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్లు కావాలని ప్రయత్నిస్తుంటారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఫ్యాన్సీ నెంబర్స్ ను ఇష్టపడే వారిని రవాణాశాఖ చేదు విషయాన్ని చెప్పింది. ఫ్యాన్సీ నెంబర్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకం ద్వారా ప్రతి ఏటా రవాణా శాఖకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. తాజాగా తీసుకున్న ధరల పెంపు నిర్ణయంతో ఆదాయం మరింత పెరగనుంది. 1, 9, 6666, 9999 సహా ఏకంగా 100 వరకు ఫ్యాన్సీ నెంబర్లకు ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల ధరలు ఎలా?
తెలంగాణలో అత్యంత ఫ్యాన్సీ నెంబరుగా వాహనదారులు భావించే 9999 నెంబరుకు ఇప్పటి వరకు ప్రాథమిక ధర రూ. 50 వేలు వసూలు చేసేవారు. ఆ మొత్తం చెల్లించి ఆన్ లైన్ వేలంలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికే ఆ నెంబరు కేటాయిస్తున్నారు. ఇకపై ఈ నెంబరుకు ప్రాథమిక ధర 1.5 లక్షలుగా సవరించారు. 6666 నెంబరుకు ప్రస్తుతం రూ. 30 వేలు ప్రాథమిక ధరకాగా దాన్ని రూ. 70 వేలకు పెంచనున్నారు. ఫ్యాన్సీ నెంబర్లకు ప్రస్తుతం ఐదు స్లాబులు ఉన్నాయి. నెంబరును బట్టి ప్రాథమికధర వసూలు చేస్తున్నారు. రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలుగా ప్రస్తుతం ఉన్న ఈ ఐదు స్లాబుల్ని ఏడుకు పెంచారు. రూ. 1.50 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా నిర్ణయించారు. త్వరలోనే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!