మహబూబ్ నగర్, క్రైమ్ మిర్రర్: డ్రైవర్లకు కంటి నజర్ ఎంతో కీలకమని ఎస్పీ ఎన్.బి. రత్నం అన్నారు. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, జాతీయ రహదారి 44 మీదుగా ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి, ఈసీజీ పరీక్షల వైద్య శిబిరాన్ని వాని ఐకేర్ విజయ కార్డిక్ హాస్పిటల్ వారు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
డ్రైవర్‌కు కంటిచూపు స్పష్టంగా ఉండటం అత్యంత ముఖ్యమని, డ్రైవింగ్ సమయంలో ఎదురుగా, పక్కన, వెనుక నుంచి వచ్చే వాహనాలను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని తెలిపారు. డిఫెన్స్ డ్రైవింగ్‌లో కంటిచూపు కీలక పాత్ర పోషిస్తుందని, కంటిచూపు మెరుగ్గా ఉంటే ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించగలుగుతారని పేర్కొన్నారు.
అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అలాగే సరైన లైన్ డ్రైవింగ్ పాటించడం వంటి అంశాలపై డ్రైవర్లకు పిపిటి ప్రదర్శన ద్వారా వివరించారు. డ్రైవింగ్ నైపుణ్యాలు మరియు రోడ్డు భద్రత నియమాలపై కూడా వారికి అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో బాలనగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే ఇతర భారీ వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు, ఈసీజీ చేయించుకున్నారు.
