తెలంగాణ

70 లక్షల లంచం..సీబీఐకి దొరికిన టీకాంగ్రెస్ నేత కొడుకు

తెలంగాణ కాంగ్రెస్ నేత కొడుకు అడ్డంగా బుక్కయ్యాడు. దేశమంతా యుద్ధం టెన్షన్ లో ఉండగా.. సదరు మాజీ ఎమ్మెల్యే కొడుకు మాత్రం లంచం తీసుకోవడంతో బిజీగా ఉన్నాడు. ఓ ప్రముఖ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

ఆదాయపన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్‌ను ముంబైలో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయపన్ను ఎగవేతదారులను పట్టుకుని వారి నుంచి పన్ను కట్టించాల్సిన ఉన్నతాధికారే.. మధ్యవర్తుల ద్వారా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడటం ఆదాయపన్ను శాఖలో సంచలనంగా మరింది.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడైన జీవన్ లాల్ 2004 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ హోదాలో పని చేస్తున్నారు. ఆయన సతీమణి కూడా కేంద్ర సర్వీసు సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఐటీ అప్పీల్ యూనిట్ 7,8కి ఇన్ ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జీవన్ లాల్, ఐటీ అప్పీళ్లను పరిష్కరించేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ముంబయిలో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు ప్రతినిధుల నుంచి జీవన్ లాల్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రూ.70 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

జీవన్ లాల్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ముంబయి, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ, విశాఖపట్నంలోని 18 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. కీలక పత్రాలతో పాటు రూ.69 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జీవన్ లాల్‌తో పాటు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయిరాం పోలిశెట్టి, విశాఖకు చెందిన నట్టా వీరనాగ శ్రీరాంగోపాల్, షాపూర్ జీ గ్రూపు డీజీఎం కాంతిలాల్ మెహతా, సాజిదా మజహర్ హుస్సేన్ షాను అరెస్టు చేశారు.లంచం డబ్బు, సోదాల్లో దొరికిన డబ్బు కలిపి మొత్తం రూ.1 కోటి 39 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button