
ప్రపంచంలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన సంప్రదాయాలకు నిలయంగా ఉంటుంది. కొన్ని అలవాట్లు మనకు ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని నమ్మలేనంత వింతగా అనిపిస్తాయి. అలాంటి వింతల్లో ఒకటి ఈ గ్రామం. ఇక్కడి ప్రజలు జీవితాంతం దుస్తులు ధరించకుండా ఉండటాన్నే ఒక జీవన విధానంగా స్వీకరించారు. అడవుల్లో నివసించే ఆటవిక తెగలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది అత్యంత అభివృద్ధి చెందిన, నాగరికతకు ప్రతీకగా చెప్పుకునే గ్రేట్ బ్రిటన్ దేశంలో ఉన్న గ్రామం. చదువులు చదివినవారు, సంపన్నులు, ఆధునిక సౌకర్యాలు కలిగినవారు అయినప్పటికీ ఇక్కడి ప్రజలు బట్టలు ధరించకుండా జీవించడం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ వింత గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం దాదాపు 85 ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ నివసించే వారిలో చాలామంది కోటీశ్వరులే. ఆస్తిపాస్తులు, ఉన్నత చదువులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నా.. దుస్తులు మాత్రం అవసరం లేదనే భావనతో జీవిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా అందరూ నగ్నంగానే జీవిస్తారు. ఇది వారికి ఎలాంటి సిగ్గు, అసౌకర్యం కలిగించదని గ్రామస్తులు చెబుతారు.
స్పీల్‌ప్లాట్జ్ గ్రామాన్ని 1929లో ఇసుల్ట్ రిచర్డ్‌సన్ అనే వ్యక్తి స్థాపించాడు. అతడికి ప్రకృతితో సహజంగా జీవించాలనే ఆలోచన బలంగా ఉండేది. దుస్తులు అనేవి మనిషి సృష్టించిన కృత్రిమ అవరోధాలే అనే భావనతో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తరువాత అతడే స్వయంగా తన జీవితాంతం అక్కడే, గ్రామస్తుల్లా బట్టలు లేకుండా జీవించాడు. కాలక్రమేణా అతడి ఆలోచనలకు మద్దతుగా మరెందరో చేరారు. అలా ఈ గ్రామం ఒక ప్రత్యేక జీవన విధానానికి కేంద్రంగా మారింది.
ఈ గ్రామాన్ని నాగరికత లేని ప్రాంతంగా భావించడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి. పబ్‌లు, క్లబ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు, వినోద కేంద్రాలు అన్నీ ఉన్నాయి. ఆధునిక జీవన శైలిని అనుభవిస్తూనే, దుస్తులు లేకుండా జీవించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి ప్రజలు ప్రకృతితో మరింత దగ్గరగా ఉండటమే తమ లక్ష్యమని చెబుతారు. శరీరాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదని, అది సహజమేనని వారు నమ్ముతారు.
ఈ గ్రామానికి వెళ్లే పర్యాటకులకూ అదే నియమాలు వర్తిస్తాయి. స్పీల్‌ప్లాట్జ్‌లో అడుగు పెట్టాలంటే బట్టలు లేకుండానే వెళ్లాలి. దుస్తులు ధరించి వెళ్లే వారికి గ్రామంలోకి ప్రవేశం ఉండదు. ఈ నియమం మొదట వింటే షాక్ ఇచ్చినా.. అక్కడికి వెళ్లినవారు కొద్ది సేపట్లోనే అలవాటు పడతారని చెబుతారు. ప్రకృతితో కలిసిపోయిన అనుభూతి కలుగుతుందని పర్యాటకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అయితే ఒక సందేహం సహజంగానే వస్తుంది. ఈ గ్రామస్తులు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా బట్టలు లేకుండానే తిరుగుతారా అనే ప్రశ్న. దీనికి సమాధానం చాలా సింపుల్. గ్రామం బయటకు వెళ్లినప్పుడు, అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా ఇతర పనుల కోసం నగరాలకు వెళ్లినప్పుడు వీరు సాధారణంగానే దుస్తులు ధరిస్తారు. అలాగే చలి, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంది. ఇక్కడ బట్టలు ధరించకూడదన్నది బలవంతం కాదు, అది ఒక జీవన ఎంపిక మాత్రమే.
స్పీల్‌ప్లాట్జ్ గ్రామస్తులు తమ జీవన విధానాన్ని స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. శరీరాన్ని అంగీకరించడం, ప్రకృతితో ఏకమవడం, సామాజిక కృత్రిమ నియమాల నుంచి బయటపడటం అనే తత్వమే ఈ గ్రామం వెనుక ఉన్న ప్రధాన కారణం. ప్రపంచానికి ఇది వింతగా అనిపించినా.. వారికి మాత్రం ఇది సాధారణ జీవితం. ఈ గ్రామం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ALSO READ: 3,500 నగ్న ఫోటోలు, వీడియోలు తొలగింపు





