Donald Trump vs European Leaders: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ లో అల్లకల్లోలానికి కారణం అవుతున్నారు. గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా ఉన్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను మళ్లీ బయటకు తీయడంతో పాటు యూరప్ నేతల ప్రైవేటు సంభాషణలనూ బయటపెడుతున్నారు. ఫ్రాన్స్ పై ఏకంగా 200 శాతం సుంకాలను విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. చాగోస్‌ను మారిషస్‌కు అప్పగించాలని బ్రిటన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ట్రంప్ తీరుపై యురోపియన్ కంట్రీస్ దీటుగానే స్పందిస్తున్నాయి. ప్రతి సుంకాలను ప్రకటిస్తామని హెచ్చరించాయి. ఈయూ-అమెరికాల వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. జీ7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐరోపా, అమెరికా దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మన దేశంలోని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నేలచూపులు చూశాయి. రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
అప్పట్లో అనుకూలం, ఇప్పుడు ప్రతికూలం
గతంలో మారిషస్‌కు చాగోస్ ద్వీపాల అప్పగింతపై సానుకూలంగా స్పందించిన ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. “తెలివైన నాటో భాగస్వామి అయిన బ్రిటన్.. హిందూ మహా సముద్రంలో ఉన్న డీగో గార్షియా ద్వీపాన్ని మారిషస్‌కు అప్పగించడానికి ప్రణాళిక రూపొందించింది. అది అమెరికా బాంబర్లకు, నేవీకి కీలక స్థావరం. కారణం లేకుండానే బ్రిటన్ ఆ పని చేస్తోంది. ఈ చర్యను కచ్చితంగా చైనా, రష్యా మన బలహీనత అనే అనుకుంటాయి. అత్యంత కీలకమైన భూభాగాన్ని బ్రిటన్ అప్పగించడం తెలివి తక్కువతనమే. దాని అప్పగింత కారణంగానే గ్రీన్‌లాండ్‌ను అమెరికా కావాలనుకుంటోంది”అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ షాక్!
గ్రీన్‌లాండ్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ట్రంప్ వ్యాఖ్యలు షాకిచ్చాయి. గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ ప్రకటించడం పూర్తిగా తప్పని, అయితే చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆయన ప్రకటించారు.
ట్రంప్ కు వ్యతిరేకంగా ఒక్కటైన యూరప్ దేశాలు
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పేట దాడికి యురోపియన్ కూటమి సిద్ధమైంది. ప్రతీకార చర్యలకు ఉన్న పలు అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది. ప్రతీకార సుంకాలు, ఈయూ-అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపివేత, అమెరికా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను విధించాలని భావిస్తున్నాయి.





