Republic Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఓ దేశాధినేతని భారత్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 2026 జనవరి 26వ తేదీన జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు రాబోతున్నట్టు తెలుస్తోంది. తొలిసారిగా ఒకేసారి పలు దేశాల కూటమికి చెందిన నాయకులు భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా పిలవడం విశేషం. ఈయు కూటమిలోని కీలక నేతలు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈయూతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం
యూరోపియన్ యూనియన్‌తో భారత్ అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశలో ఉంది. అలాగే భారత్-ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామం ఉంది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాను ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో భారత్-ఈయూ సమ్మిట్ జరగనుంది. దాదాపు అదే సమయంలో ఈ నాయకులు భారత్‌కు రాబోతున్నట్టు సమాచారం. ఓవైపు సమ్మిట్, మరోవైపు రిపబ్లిక్ వేడుకలను ఈయు నేతలు కవర్ చేయనున్నారు.
భారత్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
భారత్-ఈయూల మధ్య చాలా కాలంగా ఉచిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ చర్చల్లోనూ పురోగతి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందం గురించి భారత్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో భారత్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తవుతుందని ఈయూ ట్రేడ్ కమిషనర్ మరోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ వాణిజ్య ఒప్పందపై భారత్ స్పందించే అవకాశం ఉంది.





