
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే జోర్డాన్‌ను విజయవంతంగా సందర్శించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాతి దశలో ఇథియోపియాకు చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఇథియోపియాను సందర్శించడంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీకి ఇథియోపియాలో అరుదైన, హృదయాన్ని తాకే స్వాగతం లభించింది.
At yesterday’s banquet dinner hosted by Prime Minister Abiy Ahmed Ali, a wonderful rendition of Vande Mataram was sung by Ethiopian singers. It was a deeply moving moment, that too at a time when we are marking 150 years of Vande Mataram. @AbiyAhmedAli pic.twitter.com/TeHbPzBBLb
— Narendra Modi (@narendramodi) December 17, 2025
ఇథియోపియా రాజధానిలో ప్రధాని మోదీ గౌరవార్థం ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో చోటుచేసుకున్న ఓ దృశ్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతంగా గుర్తింపు పొందిన వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. విదేశీ గడ్డపై భారత స్వాతంత్ర్య భావనను ప్రతిబింబించే వందేమాతరం ఆలాపనను వినగానే ప్రధాని మోదీ పులకించిపోయారు. గాయకులను ఉత్సాహపరిచేలా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వందేమాతరం గీతానికి ఈ ఏడాది 150 వసంతాలు పూర్తి కావడం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన ఈ గీతం.. ఇథియోపియా లాంటి ఆఫ్రికా దేశంలో ప్రతిధ్వనించడంతో భారతీయులకు గర్వకారణంగా మారింది. రెండు దేశాల మధ్య స్నేహబంధానికి, సాంస్కృతిక అనుబంధానికి ఇది ఓ సజీవ నిదర్శనంగా నిలిచింది.
భారత్- ఇథియోపియా సంబంధాలు చారిత్రకంగా బలమైనవే. వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, రక్షణ రంగాల్లో రెండు దేశాలు పరస్పర సహకారం కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనతో ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలతో భారత్ వ్యూహాత్మకంగా సంబంధాలు పెంచుకుంటున్న ఈ సమయంలో, ఇథియోపియా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
ఇథియోపియా గాయకులు ఆలపించిన వందేమాతరం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ నెటిజన్లు ఈ దృశ్యాన్ని గర్వంగా షేర్ చేస్తూ, భారత సంస్కృతి, దేశభక్తికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. విదేశీ నేలపై భారత గీతం మార్మోగడం, ప్రధాని మోదీకి లభించిన ఈ ప్రత్యేక గౌరవం భారత దౌత్య శక్తిని మరోసారి చాటిచెప్పింది.
ALSO READ: Technology: టీవీ యాప్‌ను విడుదల చేసిన Insta.. ఇకపై టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ చూడొచ్చు!





