జాతీయం

ED Raids I-PAC: ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు, కీలక ఆధారాలను ఎత్తుకెళ్లిన మమత!

బెంగాల్ లో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ సోదాలు రాజకీయ దుమారం రేపాయి. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించగా, సీఎం మమత జైన్ ఇంటికి వెళ్లి కీలక ఆధారాలు ఎత్తుకెళ్లారు.

Enforcement Directorate Raids On iPAC: రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోల్‌కతాలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ప్రతీక్‌ జైన్‌ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.

సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు జైన్‌ నివాసంలో తనిఖీలు చేస్తుండగా.. మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మనోజ్‌ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈడీ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్ర లో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి ప్రతీక్‌ జైన్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఆమె అనుచరులు చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మమత 20-25 నిమిషాల పాటు ప్రతీక్‌ జైన్‌ నివాసంలోనే ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్లేటప్పుడు చేతిలో గ్రీన్‌ ఫోల్టర్‌ తీసుకెళ్లారు

మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారన్న ఈడీ

బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో సోదాలు జరుపుతుండగా.. సీఎం మమతా బెనర్జీ వచ్చి కీలక ఆధారాలను తీసుకెళ్లిపోయారని ఈడీ ఆరోపించింది. కొన్ని పత్రాలతో పాటు హార్డ్‌ డిస్క్‌లను కూడా ఆమె ఎత్తుకెళ్లిపోయారని తెలిపింది. ఐ-ప్యాక్‌ కార్యాలయం నుంచి మమత, ఆమె అనుచరులు, పోలీసులు బలవంతంగా పత్రాలు, హార్డ్‌ డిస్క్‌ లను తీసుకెళ్లిపోయారని పేర్కొంది.

2020లో నమోదైన బొగ్గు అక్రమ రవాణా కేసులో భాగంగా బెంగాల్‌లో ఆరు చోట్ల, ఢిల్లీలో నాలుగు చోట్ల తనిఖీలు చేసినట్లు వెల్లడించింది. కేసులో నిందితుడిగా ఉన్న హవాలా నిర్వాహకుడు ఒకరు ఐ-ప్యాక్‌తో రూ.కోట్లలో నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని తెలిపింది. అందులో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. సీఎం మమత, కోల్‌కతా సీపీ కలిసి తమ విచారణ కు అడ్డంకులు సృష్టించారని తెలిపింది. తాము ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదని, పార్టీ కార్యాలయాల్లో తనిఖీలు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు, ఈ సోదాలకు సంబంధం లేదని.. చట్టప్రకారమే తాము మనీలాండరింగ్‌ ఆరోపణలపై సోదాలు నిర్వహించామని తేల్చిచెప్పింది. కాగా, తమ విచారణకు అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నించింది. విచారణలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోర్టును కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button