ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే విభాగానికి చెందిన ఒక లోకో పైలట్‌కు జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న రాజేష్ మీనా అనే ఉద్యోగి చాలా కాలంగా పైల్స్ సమస్యతో బాధపడుతున్నాడు. ఆరోగ్య సమస్య తీవ్రమవడంతో అతను ఫిబ్రవరి 22న లక్నోలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ శస్త్రచికిత్స అనంతరం వైద్యులు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో అతనికి ఫిబ్రవరి 28 వరకు సెలవు మంజూరైంది.
A Railway loco pilot suffering from piles was asked to show evidence of the medical issue to get his sick leave approved. He did. pic.twitter.com/kzMXiD80tv
— Piyush Rai (@Benarasiyaa) March 4, 2026
అయితే శస్త్రచికిత్స అనంతరం గాయం పూర్తిగా మానకపోవడంతో రాజేష్ మీనా ఇంకా పనికి హాజరు కావడానికి అనుకూల స్థితిలో లేకపోయాడు. దీంతో సెలవును మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించి రైల్వే హెల్త్ యూనిట్‌ను సంప్రదించాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఇంకా విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి సిక్ మెమో తీసుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో రాజేష్ మీనా సెలవు పొడిగింపుకు అనుమతి పొందేందుకు క్రూ కంట్రోలర్‌తో పాటు చీఫ్ క్రూ కంట్రోలర్ రతన్ కుమార్‌ను సంప్రదించాడు. తన ఆరోగ్య పరిస్థితిని వివరించేందుకు పైల్స్ శస్త్రచికిత్సకు సంబంధించిన అన్ని వైద్య పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, డ్రెస్సింగ్ వివరాలను అధికారికి చూపించాడు. అయినప్పటికీ ఆ అధికారి సెలవు మెమో ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం.
తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో రాజేష్ మీనా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చివరకు తన పరిస్థితి ఎంత తీవ్రమైందో వివరించేందుకు అతను అక్కడే ప్యాంటు విప్పి శస్త్రచికిత్స గాయాన్ని అధికారికి చూపించిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనను అక్కడున్న అతని అనుచరుల్లో ఒకరు వీడియోగా రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
ఈ ఘటనపై రైల్వే ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగి సెలవు పొడిగింపును కోరినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంఘం ఆరోపించింది. చివరకు యూనియన్ నేత జోక్యం చేసుకోవడంతో రాజేష్ మీనాకు సెలవు పొడిగింపు మంజూరైనట్లు సమాచారం.
ALSO READ: రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది?
