
Emotional: సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతిచెందిన తర్వాత తీవ్రమైన మనస్తాపానికి గురైన 18 ఏళ్ల శ్రావణి అనే యువతి తన ప్రాణాలు తానే తీసుకోవడం గ్రామాన్ని కలిచివేసింది. ఇంటర్ పూర్తిచేసుకున్న ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు కూలిపనులకు వెళ్లే సాధారణ జీవితాన్ని గడుపుతుండేది. ఇదే సమయంలో దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాతో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
అయితే ఇటీవల మహేష్ అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో శ్రావణి తీవ్రమైన మానసిక వేదనతో ఇబ్బందిపడింది. రోజురోజుకీ ఆమెలో బాధ పెరుగుతుండటాన్ని కుటుంబ సభ్యులు గమనించినా.. పరిస్థితి ఇలా మారుతుందని ఊహించలేదు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో తీవ్ర మనోవేదనతో శ్రావణి చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా రెండు ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రేమ కథ విషాదాన్నే మిగిల్చింది. శ్రావణి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





