
ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో మరోసారి సంచలనం సృష్టిస్తూ బెంగళూరుకు చెందిన స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన పాపులర్ స్కూటర్ సింపుల్ వన్‌కు సరికొత్త తరం వెర్షన్ జెన్ 2ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధునిక డిజైన్, భారీ రేంజ్, స్మార్ట్ టెక్నాలజీతో ఈ కొత్త వెర్షన్ వినియోగదారుల అంచనాలను మించేలా రూపొందించబడింది. ఇదే సమయంలో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా సింపుల్ అల్ట్రా పేరుతో మరో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది.
సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే లక్షణాలతో వచ్చింది. ఈ స్కూటర్‌లో ఏకంగా 6.5 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందని కంపెనీ ఐడీసీ సర్టిఫికేషన్ ఆధారంగా వెల్లడించింది. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ పనితీరుతో దేశంలోనే రెండవ వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా సింపుల్ అల్ట్రా నిలిచింది. అన్ని వేరియంట్లలోనూ టాప్ లెవల్ పనితీరు అందించేలా దీన్ని రూపొందించారు. అయితే ఈ మోడల్ ధర వివరాలను సంస్థ త్వరలో వెల్లడించనుంది.
ఇక సింపుల్ వన్ జెన్ 2 డిజైన్ విషయానికి వస్తే.. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే మరింత షార్ప్ లైన్స్‌తో, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో కనిపిస్తోంది. సోనిక్ రెడ్, ఏరో ఎక్స్, ఆస్ఫాల్ట్ ఎక్స్ అనే మూడు కొత్త రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యువతను ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
బలమైన నిర్మాణం కోసం ఈ స్కూటర్ ఛాసిస్‌ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. దీనివల్ల బాడీ దృఢత్వం దాదాపు 22 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. అధిక వేగంలో ప్రయాణించే సమయంలో కూడా స్కూటర్ చాలా స్థిరంగా ఉంటుందని వెల్లడించింది. వినియోగదారుల్లో మరింత నమ్మకం పెంచేలా బ్యాటరీ, మోటార్‌పై జీవితకాల వారంటీని సింపుల్ ఎనర్జీ అందించడం విశేషం.
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ పరంగా సింపుల్ వన్ జెన్ 2 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్‌లో 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉండగా, ఇది 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 2.55 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. మిడ్ వేరియంట్‌లో 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 236 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఈ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన వన్ ఎస్‌లో 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉండి 190 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ వేరియంట్ కూడా గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.
బ్యాటరీ బరువును సుమారు 4 కిలోల వరకు తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది. వర్షం, ధూళి నుంచి పూర్తి రక్షణ కోసం ఈ స్కూటర్‌కు ఐపీ 67 రేటింగ్‌ను కూడా అందించారు. టెక్నాలజీ పరంగా సింపుల్ వన్ జెన్ 2 మరో మెట్టు ఎక్కింది. కొత్తగా అభివృద్ధి చేసిన సింపుల్ ఓఎస్ ఈ స్కూటర్‌కు అందుబాటులో ఉంది. భద్రత పరంగా డ్రాప్ సేఫ్ ఫీచర్ ఉండటం విశేషం. స్కూటర్ కింద పడితే ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కొండ ప్రాంతాల్లో వెనక్కి జారకుండా అడ్డుకునే సూపర్ హోల్డ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఇందులో 7 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, రియల్ టైమ్ వెహికల్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే సీటు కింద 35 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ అందించడం రోజువారీ వినియోగానికి మరింత ఉపయోగకరంగా మారింది.
ధరల విషయానికి వస్తే బెంగళూరు ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం సింపుల్ వన్ ఎస్ వేరియంట్ ధర రూ.1,49,999గా ఉంది. 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే సింపుల్ వన్ ధర రూ.1,69,999 కాగా, టాప్ వేరియంట్ 5 కిలోవాట్ అవర్ మోడల్ ధర రూ.1,77,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద ప్రస్తుతం బేస్ మోడల్‌ను కేవలం రూ.1,39,999కే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ALSO READ: ఇంటర్ విద్యార్థినిని పీరియడ్స్‌కు ఫ్రూఫ్ చూపించమన్న లెక్చరర్లు, ఆపై..





