
Electric Car: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊహించని వేగంతో పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తక్కువ ఖర్చుతో ప్రయాణించగల బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ మారుతున్న పరిస్థితిని గమనించిన పలు కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూనే ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది Eva అనే చిన్న కారు. కానీ వినియోగదారులకు అత్యంత అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారు. పరిమాణంలో కాంపాక్ట్‌గా కనిపించినప్పటికీ, ఇద్దరు పెద్దలు ఒక చిన్న పిల్లవాడు సౌకర్యంగా కూర్చునేలా లోపలి స్థలం రూపొందించడం ఈ కారుకు ప్రత్యేకతగా మారింది.
Eva ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు వేరియంట్లలో అందిస్తోంది. ఇవి నోవా, స్టెల్లా, వేగా అని విభజించబడ్డాయి. ప్రతీ వేరియంట్ ధర, రేంజ్, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా వేర్వేరు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.2 ఖర్చు మాత్రమే అవుతుందని కంపెనీ తెలిపిన సమాచారం. ప్రస్తుతం ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఈ ధరను ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చితే Eva దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోంది. ఎక్స్ షోరూమ్ ధర నోవా వేరియంట్‌కు రూ 3.25 లక్షలు, స్టెల్లాకు రూ 3.99 లక్షలు, వేగా వేరియంట్‌కు రూ 4.49 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరల్లో ఇంత మంచి రేంజ్ ఇవ్వడం వినియోగదారులకు అదనపు ఆకర్షణగా మారింది.
నోవా వేరియంట్‌లో 9 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ వరకు ప్రయాణించే తీరికను అందిస్తుంది. స్టెల్లా వేరియంట్‌లో 12.6 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల ఇది సింగిల్ ఛార్జ్‌పై 175 కి.మీ వరకు రన్ అవుతుంది. ఇక టాప్ మోడల్ వేగా విషయానికి వస్తే, 18 కిలోవాట్ గంటల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 250 కి.మీ వరకూ ప్రయాణించగలదు. రోజూ చిన్న చిన్న దూరాలు ప్రయాణించే కుటుంబాలకు ఈ రేంజ్ చాలా సరిపోతుంది.
భద్రత విషయంలో కూడా ఈవా కారుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డ్రైవర్‌కు ప్రత్యేక ఎయిర్‌బ్యాగ్‌ను అందించడం ప్రాథమిక భద్రతా ప్రమాణాల పరంగా ఒక మంచి అడుగు. ఇంకా ఈ వాహనంలో CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పించడం వల్ల తక్కువ సమయంలో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను కూడా ఛార్జ్ చేసుకునే వీలుండడం టెక్నాలజీ వినియోగదారుల కోసం ఒక అదనపు ప్రయోజనంగా మారింది.
తక్కువ ధర, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాలు, ఉత్తమైన రేంజ్, భద్రతా సదుపాయాలు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అంశాలు Eva కారును భారతీయ మార్కెట్‌లో వేగంగా ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఈ కారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న పట్టణాల్లో నివసించే వారికి, రోజువారీ ప్రయాణాలు చేసే వారికి సరైన ఎంపికగా నిలుస్తోంది.
ALSO READ: ఉన్నట్టుండి ఆగిపోయిన మెట్రో.. చివరికి?





