
Egg Prices: గుడ్డు అనగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థం అని మనకు గుర్తుకు వస్తుంది. రోజుకి ఒక గుడ్డు తింటే దాదాపు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండిన ఈ ఆహారం క్రీడాకారులు, బాడీ బిల్డింగ్ చేసే వారు, కఠిన డైట్స్ పాటించే వారు ఎక్కువగా తీసుకునే ఆహారాలలో మొదటిది. అయితే ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా తినాల్సిన ఈ గుడ్డు ఇప్పుడు సామాన్య ప్రజలకు అందని ద్రవ్యంలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు ఒకేసారి భారీ ఎత్తున పెరిగిపోవడంతో వినియోగదారులకు గట్టి దెబ్బ తగిలింది.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర నేరుగా రూ.8 మార్క్ దాటింది. కొన్నిచోట్ల డిమాండ్ పెరిగిన వేళ రూ.8 కంటే కూడా ఎక్కువకు విక్రయిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఈ రేట్లు ఎందుకు పెరిగాయనే ప్రశ్నకు మార్కెట్ వర్గాలు అనేక కారణాలు చెబుతున్నాయి. ప్రధానంగా నార్త్ ఇండియాలో తీవ్ర చలితో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అక్కడికి ఎగుమతులు జరగడం ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, మోంథా తుఫాన్ ప్రభావంతో పౌల్ట్రీ రంగంలో ఏర్పడిన నష్టం కూడా గుడ్ల సరఫరాపై ప్రభావం చూపింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వ్యాధులు వ్యాపించడంతో కొంతమంది రైతులు పెద్ద మొత్తంలో కోళ్లు కోల్పోయారు. ఈ పరిణామం గుడ్ల ఉత్పత్తిని తగ్గించింది. ఉత్పత్తి తగ్గితే ధరలు పెరగడం సహజం.
కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నాన్-వెజ్ మార్కెట్లకు వెళ్లిన ప్రజలు గుడ్డు ధరలు చూసి ఆశ్చర్యపోయారు. కూరగాయల ధరలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో గుడ్డు కూడా ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాల ఖర్చులు మరింత పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లలో 100 గుడ్ల క్రేట్ దాదాపు రూ.673 వరకు చేరడం గుడ్డు ధరల పెరుగుదల తీవ్రతను అర్థం చేసుకునేలా చేస్తోంది. క్రేట్ ధర పెరిగితే రిటైల్ మార్కెట్‌లో ప్రతీ గుడ్డుకూ రూ.7 నుంచి రూ.8 వరకు ధర ఉండటం తప్పదు. విశాఖపట్నం, చిత్తూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో హోల్‌సేల్ ధరలు ఒక్కో క్రేట్‌కు రూ.635 నుంచి రూ.673 మధ్య ఉన్నాయి. ఈ క్రేట్ రేట్ల ఆధారంగా రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు రూ.6.50 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు.
గతంలో ధరలు కొద్దిగా పెరిగితే పెద్దగా గుర్తించలేదు. కానీ ఈసారి ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడి మాంసం ధరలు కూడా పెద్దగా పెరగకపోవడం వల్ల కొంతమంది వినియోగదారులు చికెన్ కొనడమే లాభమని కామెంట్ చేస్తున్నారు. పౌల్ట్రీ రంగం ప్రస్తుతం కఠిన పరిస్థితుల్లో ఉందని, వచ్చే కొన్ని రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ ఉత్పత్తిని రైతు బజార్లలో విక్రయించడం పై దృష్టి పెట్టుతున్నారు. ప్రభుత్వ సహకారం, ఉత్పత్తి స్థిరీకరణ చర్యలు లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Teenage Changes: టీనేజ్ అమ్మాయిలకు మీసాలు ఎందుకు వస్తాయో తెలుసా?





