జాతీయం

మీ కారు లీటర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో ఈజీగా తెలుసుకోండి!

ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాహన యజమానులు ఎక్కువగా ఆలోచించే విషయం కారు మైలేజ్ గురించే. కారు సరిగా మైలేజ్ ఇస్తుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాహన యజమానులు ఎక్కువగా ఆలోచించే విషయం కారు మైలేజ్ గురించే. కారు సరిగా మైలేజ్ ఇస్తుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొందరు కంపెనీ చెప్పే మైలేజ్‌ను నమ్ముతుంటే.. మరికొందరు వాస్తవంగా తమ వాహనం ఎంత ఇంధనం ఖర్చు చేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. అయితే చాలా మందికి సరైన పద్ధతి తెలియక అంచనాలకే పరిమితమవుతున్నారు. వాస్తవానికి ఇంట్లోనే చాలా సులభంగా కారు మైలేజ్‌ను ఖచ్చితంగా లెక్కించే పద్ధతి ఉంది. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. కాస్త శ్రద్ధగా పాటిస్తే నిజమైన మైలేజ్ ఎంత అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ముందుగా కారును పూర్తిగా ఫుల్ ట్యాంక్ చేయించాలి. పెట్రోల్ బంక్‌లో మీటర్‌ను సున్నాకు సెట్ చేసి ఇంధనం పోయించుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మీ కారు ట్రిప్ మీటర్‌ను కూడా జీరోకి రీసెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఖచ్చితంగా గమనించవచ్చు. ఫుల్ ట్యాంక్ చేసిన తరువాత సాధారణంగా మీరు చేసే రోజువారీ ప్రయాణం లేదా లాంగ్ డ్రైవ్‌ను కొనసాగించాలి.

కొంతకాలం ప్రయాణించిన తరువాత, అంటే ట్యాంక్‌లో కొంత ఇంధనం ఖాళీ అయిన తర్వాత, అదే పెట్రోల్ బంక్ లేదా మరొక విశ్వసనీయ బంక్‌లో మళ్లీ ఫుల్ ట్యాంక్ చేయించాలి. ఈసారి ఎంత ఇంధనం పట్టిందో బిల్ లేదా మీటర్ చూసి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇదే మీ కారు ఆ దూరంలో ఖర్చు చేసిన మొత్తం ఇంధనం. ఇప్పుడు ట్రిప్ మీటర్‌లో కనిపించే కిలోమీటర్లను, మీరు ఖర్చు చేసిన లీటర్లతో భాగిస్తే మీ కారుకు వాస్తవంగా వస్తున్న మైలేజ్ తెలుస్తుంది.

ఉదాహరణకు మీరు ఫుల్ ట్యాంక్ చేసిన తరువాత 45 కిలోమీటర్లు ప్రయాణించారని అనుకుందాం. మళ్లీ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 3 లీటర్ల ఇంధనం పట్టిందని భావిస్తే, 45ని 3తో భాగిస్తే లీటర్‌కు 15 కిలోమీటర్ల మైలేజ్ వస్తున్నట్లు లెక్క. ఇదే మీ కారు నిజంగా ఇస్తున్న మైలేజ్. ఈ పద్ధతి ద్వారా కంపెనీ చెప్పే మైలేజ్‌కు, వాస్తవ మైలేజ్‌కు ఎంత తేడా ఉందో కూడా తెలుసుకోవచ్చు.

ఈ విధానం పాటించడం వల్ల వాహన పనితీరు గురించి స్పష్టత వస్తుంది. మైలేజ్ తక్కువగా ఉంటే డ్రైవింగ్ స్టైల్ మార్చుకోవడం, సర్వీస్ చేయించడం, టైర్ ప్రెషర్ చెక్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. దీంతో ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా వాహనం ఆయుష్షు కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి కారు యజమాని కనీసం నెలకు ఒకసారి అయినా ఈ విధంగా మైలేజ్‌ను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Parag Tyagi: నా భార్యను చేతబడి చేసి చంపేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button