
Earthquake In Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై ఈ తీవ్రత 3.7గా నమోదయ్యింది. ఢిల్లీతో పాటు హర్యానాలోని పలు చోట్ల భూమి కొద్ది సెకెన్ల పాటు కంపించింది. ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, గురువారం నాడు వచ్చిన భూ ప్రకంపనలతో పోల్చితే శుక్రవారం తీవ్రత తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నాడు భూకంప తీవ్రత 4.4గా నమోదయ్యింది. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానాతో సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
జజ్జార్ సమీపంలో భూకంప కేంద్రం
శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. గురువారం మాదిరిగానే శుక్రవారం నాడు కూడా జజ్జార్ సమీపంలో భూకంపం మొదలైనట్లు గుర్తించారు. ఈ భూకంపం ప్రభావంతో ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, వరుసగా రెండో రోజూ భూకంపం రావడం వల్ల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అదీ సాయంత్రం సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడి, చాలా మంది ఆరుబయటే పడుకున్నారు. ఓవైపు వర్షాలు రావడం, మరోవైపు భూకంప భయంతో ప్రజలకు కంటిమీద కునుకు ఉండటం లేదు.