జాతీయం

బెదిరింపులకు భారత్ తలొగ్గదు, తేల్చి చెప్పిన జైశంకర్!

Pakistan’s Nuclear Threat: భారత్ ఎప్పుడూ అణు బెదిరింపులకు తలొగ్గదని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. బెదిరింపులకు లొంగే స్థితిలో భారత్ ఇప్పుడు లేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ఆయన.. పాక్‌ న్యూక్లియర్ వెపన్స్ వార్నింగ్స్ ను ఏమాత్రం  పట్టించుకోబోమన్నారు. అందుకు తాజా ఉదాహారణ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అన్నారు. ఆదేశం అణుబాంబులను బూచిగా చూపించినా, తలొగ్గకుండా, పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పినట్లు వెల్లడించారు. దాయాది దేశం కారణంగా భారత్ వరుస ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఆర్థిక యుద్ధ చర్యగా అభిప్రాయపడ్డారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి చెందడాన్ని తట్టుకోలేక ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడులు చేశారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడే ఉగ్రవాదులను పాకిస్తాన్ వెనుకుండి ప్రోత్సహిస్తుందన్నారు. వారికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని విమర్శించారు.

కరుడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్ లోనే!

ఐక్యరాజ్య సమితి జాబితాలో కరుడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్థాన్ లోనే ఉన్నారని జైశంకర్ తెలిపారు. స్వేచ్ఛగా ఆ దేశంలో ఉగ్రకార్యలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? పాకిస్థాన్ కు పూర్తిగా తెలుసన్నారు. పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరించే ప్రభుత్వాలకు భారత్ సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తుందన్నారు.

భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం!

తాజాగా తలెత్తిన భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల విషయంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, పాక్, భారత్ కు వ్యతిరేకంగా చర్చలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్-పాక్ మధ్య జరిగిన దాడులను ఆపడానికి ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అమెరికా-భారత్ వాణిజ్య చర్చల విషయంలో పాక్ ఉద్రిక్తతలు ఏమాత్రం ప్రభావం చూపించబోదన్నారు.

Read Also: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. ఎన్ని రోజులంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button