
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి కుటుంబాల అవసరాలను అత్యంత సమర్థంగా తీర్చే విభాగంగా బడ్జెట్ ఎంపీవీ సెగ్మెంట్ నిలుస్తోంది. కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణం, సరసమైన ధర, మంచి మైలేజీ, భద్రతా ఫీచర్లు.. ఇవన్నీ ఒకే కారులో కావాలనుకునే వారికి ఎంపీవీలు మొదటి ఎంపికగా మారాయి. ఈ నేపథ్యంలో, ఈ సెగ్మెంట్‌లో కొత్త ఊపు తీసుకురావడానికి జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన సరికొత్త 7 సీటర్ ఎంపీవీని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ‘నిస్సాన్ గ్రావైట్’ అనే పేరుతో వస్తున్న ఈ కారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిస్సాన్ మాగ్నైట్ తరహాలోనే మార్కెట్‌ను షేక్ చేయనుందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చాలాకాలంగా ఈ కారుపై ఊహాగానాలు వినిపిస్తుండగా తాజాగా నిస్సాన్ అధికారికంగా లాంచ్ తేదీని ఖరారు చేసింది. జనవరి 21, 2026న నిస్సాన్ గ్రావైట్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. మాగ్నైట్ ద్వారా నిస్సాన్ భారత వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న నేపథ్యంలో, అదే నమ్మకంతో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా గ్రావైట్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ధరలో 7 సీటర్ ఎంపీవీని అందించడం ద్వారా మారుతి ఎర్టిగా వంటి మార్కెట్ లీడర్లకు గట్టి పోటీ ఇవ్వాలన్నది నిస్సాన్ వ్యూహంగా కనిపిస్తోంది.
డిజైన్ విషయానికి వస్తే.. గ్రావైట్ సాధారణ ఫ్యామిలీ కారులా కాకుండా స్పోర్టీ, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా తీసుకున్నప్పటికీ, నిస్సాన్ తన ప్రత్యేక డిజైన్ భాషను ఇందులో స్పష్టంగా చూపించింది. ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, కొత్త స్టైల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఇన్వర్టెడ్ ఎల్ ఆకారంలో ఉన్న డిఆర్ఎల్‌లు ఈ కారుకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. బంపర్ డిజైన్‌లో చేసిన ప్రత్యేక కటింగ్స్ వల్ల కారు మరింత వెడల్పుగా, రోడ్డుపై గంభీరంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో గ్రావైట్ బ్యాడ్జింగ్, స్లీక్ టెయిల్ ల్యాంప్స్ కారుకు మరింత ప్రీమియం టచ్‌ను అందిస్తున్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ కారును పూర్తిగా ఫ్యామిలీ యూజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. క్యాబిన్‌లో 8 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. డ్రైవర్ కోసం 7 అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు రోజువారీ డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఏడుగురు ప్రయాణించినా అందరికీ సమానంగా చల్లని గాలి అందేలా రెండో, మూడో వరుస సీట్ల వద్ద ప్రత్యేక ఏసీ వెంట్లను ఏర్పాటు చేశారు.
లగేజీ అవసరాల విషయానికొస్తే.. గ్రావైట్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. మూడో వరుస సీట్లను అవసరానికి అనుగుణంగా మడిచివేయడం లేదా తొలగించడం ద్వారా ఎక్కువ బూట్ స్పేస్‌ను పొందవచ్చు. దీర్ఘ ప్రయాణాలకు వెళ్లే కుటుంబాలకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం వరకు అందరికీ అనుకూలంగా ఈ కారును డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
భద్రత విషయంలో నిస్సాన్ ఎక్కడా రాజీపడలేదు. ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ భారత్ NCAP, గ్లోబల్ NCAP టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి బ్రాండ్‌పై విశ్వాసాన్ని పెంచింది. అదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వస్తున్న గ్రావైట్ కూడా అదే స్థాయి భద్రతను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి కీలక భద్రతా ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఇంజిన్ పరంగా చూస్తే.. నిస్సాన్ గ్రావైట్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఇది సుమారు 71 బీహెచ్‌పీ పవర్, 96 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారుల సౌకర్యం కోసం 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజీ విషయంలోనూ ఈ కారు ఆకట్టుకోనుందని అంచనా. లీటరుకు దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీ వచ్చే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు.
ధర విషయానికి వస్తే.. నిస్సాన్ గ్రావైట్ ప్రారంభ ధర సుమారు రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ధర శ్రేణిలో ఇన్ని ఫీచర్లు, 7 సీటింగ్ సామర్థ్యం, మంచి భద్రత అందించడం ద్వారా గ్రావైట్ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా మారనుంది. మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్‌లో ఒక ఆల్ రౌండర్ ఎంపీవీగా నిస్సాన్ గ్రావైట్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: పోలీసుల బట్టల ఊడదీస్తాం.. BRS మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ (VIDEO)





