
సెలవులు వచ్చాయంటే చాలామంది తమ రోజువారీ జీవనశైలిని పూర్తిగా మరిచిపోతారు. విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మొదలైన సెలవులు, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ వ్యాయామం చేయని వారు సెలవుల్లో ఒక్కసారిగా ట్రెకింగ్, స్విమ్మింగ్, ఎక్కువ దూరం నడవడం వంటి శారీరక శ్రమకు పాల్పడితే గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు.
సాధారణంగా శరీరానికి అలవాటు లేని వ్యాయామం లేదా అధిక శ్రమ ఒక్కసారిగా చేయడం వల్ల గుండె వేగంగా పని చేయాల్సి వస్తుంది. దీంతో హార్ట్ రేట్, రక్తపోటు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రెకింగ్ వంటి కార్యక్రమాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోకుండా చేయడం ప్రమాదకరమని నిపుణుల సూచన.
ఇక సెలవుల్లో చాలా మంది అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం సాధారణంగా మారింది. ప్రయాణాలు, వినోద కార్యక్రమాల కారణంగా నిద్రపోయే సమయం మారిపోతుంది. ఈ నిద్రలేమి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి గుండెపై అదనపు భారం పడుతుంది.
అదే సమయంలో సెలవుల్లో అతిగా మద్యం సేవించడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న ఆహారం BPని నియంత్రణలో లేకుండా చేస్తుంది. ఈ పరిస్థితులు కలిసివస్తే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రయాణ సమయంలో గుండె సంబంధిత మందులను తీసుకోకపోవడం. చాలామంది సెలవులకు వెళ్లినప్పుడు మందులు తీసుకెళ్లడం మరిచిపోతారు లేదా నిర్లక్ష్యం చేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలు, రక్తపోటు, షుగర్ ఉన్నవారు మందులు తప్పనిసరిగా సమయానికి తీసుకోవాల్సిందే.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున, సెలవుల్లో కూడా క్రమశిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి అలవాటు లేని వ్యాయామాలను ఒక్కసారిగా చేయకుండా, మెల్లగా ప్రారంభించడం, సరైన నిద్ర, నియంత్రిత ఆహారం, మద్యం తగ్గించడం, అవసరమైన మందులను వెంట తీసుకెళ్లడం ద్వారా గుండెను రక్షించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా..?





