* గాడిదల పెంపకానికి భారీగా రాయితీ
* సరికొత్త స్కీం తీసుకొచ్చిన కేంద్ర సర్కారు
క్రైమ్ మిర్రర్, జనరల్: ఎవరైనా పశువుల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తారు. పాడి పశువుల పెంపకానికి ప్రాధాన్యమిస్తారు. ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గాడిదలను పెంచాలని సూచించడం విశేషం. అందుకు కారణం దేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోవడమే. ప్రమాదకర స్థితిలో వాటి సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇలానే వదిలేస్తే అంతరించిపోతున్న జంతువుల జాబితాలో గాడిద చేరిపోతుందని ఆందోళనతో ఉంది. అందుకే క్షీణిస్తున్న గాడిదల సంఖ్యను పెంచేలా వాటి పెంపకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను కొత్త పథకం ప్రకటించింది. గాడిదల పెంపకానికి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాతీయ పశుసంపద మిషన్ కింద ఈ చొరవ తీసుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచడం, దేశీయ జాతులను పరిరక్షించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
భారీ ఆర్థిక ప్రోత్సాహం..
సాధారణంగా గాడిదల పెంపకం అంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి. అందుకే భారీ ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే గాని వీలుపడదని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద గాడిదలు, గుర్రాలు, వంటల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్రం. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు 50 లక్షల రూపాయల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వరకు సబ్సిడీని గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు అందిస్తోంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది.
అర్హతలతో పాటు షరతులు..
ఈ పథకానికి సంబంధించి కొన్ని రకాల అర్హతలతో పాటు షరతులు పెట్టింది. రైతులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సహకార సంఘాలు, సెక్షన్ 8 కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. గాడిదల పెంపకం యూనిట్ ఏర్పాటుకు కనీసం 50 ఆడగాడిదలు, ఐదు మగ గాడిదలు కచ్చితంగా ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేసింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని రెండు విడతల్లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం తర్వాత మొదటి విడత రాయితీ అందిస్తారు. గాడిదల పెంపకం కేంద్రం పూర్తయిన తర్వాత అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీ విడుదల చేస్తారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
యువత ఆసక్తి..
ఇటీవల గాడిదల పెంపకం పై యువత ఆసక్తి చూపుతోంది. వాటి పెంపకంతో కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇదో పశుసంవర్ధక వ్యాపారంగా కూడా మారింది. గాడిదల పెంపకాన్ని ఇప్పుడు అనేక దేశాల్లో ఒక ప్రత్యేకమైన వసుసంపద వ్యాపారంగా భావిస్తున్నారు. సంతానోత్పత్తికి ఉపయోగించే జంతువులను అమ్మడం ద్వారా, గ్రామీణ పరిశ్రమలకు పని చేసే గాడిదలను సరఫరా చేయడం ద్వారా, గాడిద పాలను కొన్ని రకాల రోగాలకు దివ్య ఔషధంగా వాడుతున్నందున ఆదాయం సంపాదించొచ్చు. దేశంలో కూడా గాడిదల పెంపకం గణనీయంగా పెరుగుతోంది. దీనిని మరింతగా పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
