Renuka Chowdhury Dog Row: పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా షాకింగ్ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన కారులో పెంపుడు కుక్కను పార్లమెంటు ప్రాంగణానికి తీసుకువచ్చారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ కుక్కను తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయడమమే అవుతుందని మండిపడింది.
కరిచే వాళ్లు లోపలే ఉన్నారు!
అటు ఈ వ్యవహారంపై రేణుకా చౌదరి ఎదురు దాడికి దిగారు. “ఒక మూగ జీవి కారులో ఉంటే వారికి ఎందుకు అంత ఇబ్బంది? దీనిపై ఏదైనా చట్టం ఉందా? నేను వస్తుండగా దారిలో ఒక స్కూటరు, కారు ఢీకొన్నాయి. చిన్న కుక్క రోడ్డుపై తిరుగుతోంది. దానికి దెబ్బతగిలి ఉంటుందని అనిపించి దానిని కారులో ఎక్కించుకున్నాను. నేరుగా పార్లమెంటుకు వచ్చాను. వెంటనే దాన్ని వెనక్కి పంపించేశాను. కారు వదిలిపెట్టినట్టే కుక్క విషయంలోనూ చేశాను. దీనిపై చర్చించేదేముంది? కుక్కపిల్ల ఎవరినీ కరవదు. నిజంగా కాటు వేసేవాళ్లు పార్లమెంటులో కూర్చున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము మూగజీవాలను ప్రేమిస్తాం. పార్లమెంటులో కూర్చుని ప్రతిరోజూ మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మేము మాట్లాడదలచు కోలేదు” అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తప్పు చేసి సమర్థించుకోవడం ఏంటి?
అటు రేణుకా చౌదరి చర్యను బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తీవ్రంగా తప్పుపట్టారు. పెంపుడు కుక్కను పార్లమెంటుకు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇది వాకింగ్ చేసే ప్రయత్నం కాదని, దేశ అత్యున్నత చట్టసభ అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను ఆమె దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జవాబుదారీతనం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





