
హస్త ప్రయోగం వల్ల జుట్టు రాలుతుందా అనే ప్రశ్న చాలా కాలంగా యువతలో విస్తృతంగా చర్చకు వస్తున్న అంశం. దీనిపై అనేక అపోహలు, భయాలు సోషల్ మీడియా, మౌఖిక ప్రచారం ద్వారా వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ గౌరంగ్ కృష్ణ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. హస్త ప్రయోగానికి, జుట్టు రాలడానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.
డాక్టర్ గౌరంగ్ కృష్ణ మాట్లాడుతూ.. హస్త ప్రయోగం అనేది పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ అని తెలిపారు. సెక్స్ లేదా లైంగిక సంపర్కం ఎంత సహజమో, హస్త ప్రయోగం కూడా అంతే సహజమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల శరీర బలం తగ్గిపోతుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని భావించడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలకు దీనిని కారణంగా భావించడం శాస్త్రీయంగా అసత్యమని తెలిపారు.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన అంశాలు, ఆహార లోపాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటేనని డాక్టర్ వివరించారు. హస్త ప్రయోగం వల్ల శరీరంలో ఎలాంటి హార్మోనల్ అసమతుల్యత రాదని, జుట్టు వేర్లు బలహీనపడవని స్పష్టం చేశారు. కాబట్టి ఈ అలవాటును జుట్టు సమస్యలతో కలిపి చూడడం అపోహ మాత్రమేనన్నారు.
అలాగే హస్త ప్రయోగం వల్ల శారీరక బలహీనత వస్తుందన్న ప్రచారం కూడా పూర్తిగా తప్పని డాక్టర్ గౌరంగ్ కృష్ణ తెలిపారు. ఇది శరీరంలోని శక్తిని శాశ్వతంగా తగ్గించదని, పురుషుల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపదని చెప్పారు. ఈ విషయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే యువతలో అనవసరమైన భయాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
హస్త ప్రయోగం తర్వాత పరిశుభ్రత పాటించడం మాత్రం చాలా ముఖ్యమని డాక్టర్ సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. అయితే హస్త ప్రయోగం వల్ల మొటిమలు వస్తాయన్న వాదన కూడా పూర్తిగా అపోహేనని ఆయన స్పష్టం చేశారు. మొటిమలు రావడానికి కారణం హార్మోన్ల మార్పులు, చర్మ సంరక్షణ లోపం, ఆహార అలవాట్లు మాత్రమేనని వివరించారు.
సమాజంలో లైంగిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ తరహా అపోహలు విస్తరిస్తున్నాయని డాక్టర్ పేర్కొన్నారు. వైద్య నిపుణుల మాటలను నమ్మకుండా, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మడం వల్ల యువత మానసిక ఒత్తిడికి లోనవుతుందని హెచ్చరించారు. అవసరమైతే డాక్టర్లను సంప్రదించి సరైన సమాచారం పొందాలని సూచించారు.
ALSO READ: ప్రభుత్వ ఉద్యోగం లేకుంటే 10 గ్రాముల గోల్డ్.. కేంద్రం క్లారిటీ





