
Giorgia Meloni Doctored Pictures: మార్ఫింగ్ ఫోటోల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తలనొప్పిగా మారాయి. తాజాగా ఇటలీలో మార్ఫింగ్ పొటోల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఏకంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ ఫొటోలనే మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేయడం చర్చకు దారి తీసింది.
‘ఫికా’ సైట్ లో మెలోని ఫోటోలు
ఇటలీ ప్రధాన మంత్రి మెలోని, ఆమె సిస్టర్ సహా దేశంలోని ప్రముఖ మహిళా నేతలకు చెందిన మార్ఫింగ్ ఫొటోలు ఫికా అనే పోర్నోగ్రఫీ వెబ్ సైట్ లో దర్శనమిచ్చాయి. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో వీడియోలను రూపొందించి అప్ లోడ్ చేశారు. ఈ వెబ్ సైట్ కి దాదాపు 700,000 కంటే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. ఈ వ్యవహారం ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రధాని మెలోనీ తీవ్రంగా స్పందించారు. తన ఫొటోలు, ఇతర మహిళలకు సంబంధించిన చిత్రాలను అశ్లీల వెబ్ సైట్ లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అసహ్యకరమైన చర్యగా అభివర్ణించారు. అంతేకాదు, నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. “జరిగిన ఘటన పట్ల నాకు అసహ్యం వేస్తోంది. ఈ చర్య ద్వారా అవమానానికి, హింసకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటుంది. 2025లో కూడా ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం దారుణం. అజ్ఞాతంలో ఉండి మహిళలను లైంగిక, అశ్లీల దూషణలతో దాడి చేయడం బాధాకరం. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం” అని మెలోనీ వెల్లడించారు.