
భారతదేశ ఆర్థిక దిశను నిర్దేశించే అత్యంత కీలక ఘట్టంగా భావించే కేంద్ర బడ్జెట్‌ను నేడు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఆదాయ వ్యయాల లెక్కల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, జీవన ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే విధాన పత్రంగా ఇది నిలుస్తుంది. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, పరిశ్రమలు, పేద వర్గాలు, మధ్యతరగతి ఇలా సమాజంలోని ప్రతి వర్గం ఈ బడ్జెట్‌పై ఆశగా ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11.24 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే, ప్రతి ఏటా ఫిబ్రవరి 1ననే కేంద్ర బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నారు, ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది అనే ప్రశ్నలు చాలామందిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
నిజానికి, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి ఎప్పటి నుంచో కొనసాగుతున్నది కాదు. గతంలో, ముఖ్యంగా బ్రిటిష్ పాలన కాలం నాటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ, కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి పనిదినాన ప్రవేశపెట్టేవారు. ఈ విధానం 2016 వరకు కొనసాగింది. అప్పట్లో భారత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమయ్యేది. కానీ బడ్జెట్ ఫిబ్రవరి చివరలో ప్రవేశపెట్టడంతో, దానిపై చర్చలు, ఆమోదం, అమలు ప్రక్రియ పూర్తయ్యేలోపే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైపోయేది. దీనివల్ల మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, వ్యాపార సంస్థలు, పన్ను చెల్లింపుదారులకు కొత్త విధానాలు, పన్ను నిబంధనలను అమలు చేసుకునేందుకు తగినంత సమయం లభించేది కాదు. ఫలితంగా అనేక ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమయ్యేవి.
ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2017లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారిగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తవ్వాలన్నదే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ప్రభుత్వ శాఖలకు, రాష్ట్రాలకు, వ్యాపార రంగానికి ముందుగానే ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కలిగింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.
ఇదే సమయంలో మరో చారిత్రక మార్పు కూడా జరిగింది. వలసవాద కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటన్‌లోని పార్లమెంట్ సమయాలను అనుసరించి అమలులోకి వచ్చిన పద్ధతి. అయితే 1999లో అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ఈ సంప్రదాయానికి తెరదించారు. బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టేలా సమయాన్ని మార్చారు. దీని వల్ల మీడియా కవరేజ్ పెరగడం, ప్రజల్లో అవగాహన మెరుగుపడటం, బడ్జెట్‌పై చర్చలకు ఎక్కువ సమయం లభించడం వంటి ప్రయోజనాలు కలిగాయి.
ఫిబ్రవరి 1కి తేదీ మారినప్పుడు వివాదాలు కూడా తలెత్తాయి. ప్రభుత్వం ఈ మార్పును ప్రకటించిన వెంటనే, దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రజాకర్షక హామీలు ఇవ్వడానికి బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టుతోందని పిటిషనర్ వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కేంద్ర బడ్జెట్ అనేది వ్యక్తిగత రాష్ట్రాలకు సంబంధించినది కాదని, యావత్తు దేశానికి సంబంధించిన విధాన పత్రం అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, రాష్ట్ర ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వ పనితీరుకు ఎలాంటి ఆటంకం కలగదని కూడా కోర్టు పేర్కొంది.
అలా సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పరంపరగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రవేశపెట్టబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనుంది.
ALSO READ: ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు!





