ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత పరిస్థితులు నెలకొనడంతో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో చాలామంది మనసులో కలిగే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌లో ఎప్పుడూ 14.2 కిలోల గ్యాస్ ఎందుకు నింపుతారు? 14 కిలోలు లేదా 15 కిలోలు కాకుండా ఈ విచిత్రమైన సంఖ్యను ఎందుకు ఎంచుకున్నారు? అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. అయితే ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలు పూర్తిగా శాస్త్రీయమైనవిగా, వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే.
భారతదేశంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల వినియోగం 1950 దశకంలో ప్రారంభమైంది. ఆ సమయంలో విదేశీ సంస్థ అయిన బర్మా షెల్ దేశంలో గ్యాస్ సరఫరా బాధ్యతలు నిర్వహించేది. ఆ సంస్థే మొదటిసారిగా సిలిండర్ పరిమాణం, బరువు వంటి అంశాలను నిర్ణయించింది. అనంతరం ఈ సంస్థను భారత్ పెట్రోలియం గా మార్పు చేశారు. అప్పట్లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. గృహ వినియోగానికి అనువైన ప్రమాణంగా 14.2 కిలోల గ్యాస్‌ను నిర్ణయించడం వెనుక వినియోగదారుల సౌకర్యం, రవాణా సులభత, ఖర్చు నియంత్రణ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి.
ఈ బరువును నిర్ణయించడానికి ప్రధానంగా మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మొదటిగా, గ్యాస్ సిలిండర్ మొత్తం బరువు వినియోగదారులు సులభంగా మోయగలిగేలా ఉండాలి. గ్యాస్‌తో పాటు ఖాళీ సిలిండర్ బరువును కలిపితే అది సుమారు 29.5 కిలోలు ఉంటుంది. ఈ బరువు సాధారణ వ్యక్తి ఎత్తి మోయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ పరిమాణాన్ని పెంచి సిలిండర్ బరువు 30 కిలోల కంటే ఎక్కువైతే, దాన్ని మోయడం కష్టంగా మారుతుంది. అందుకే సేఫ్టీ, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని నిర్ణయించారు.
రెండవ కారణం కుటుంబ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ వినియోగాన్ని అంచనా వేయడం. ఆ సమయంలో నిపుణులు నిర్వహించిన సర్వే ప్రకారం.. ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు అవసరమైన గ్యాస్ పరిమాణం సుమారు 14.2 కిలోలుగా నిర్ధారించారు. ఈ పరిమాణం సాధారణంగా 30 నుండి 45 రోజుల వరకు సరిపోతుందని తేలింది. దీంతో ఒకసారి సిలిండర్ తీసుకుంటే అది ఒక నెల లేదా నెలన్నర వరకు ఉపయోగపడేలా ఉండేది. ఈ విధంగా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరైన సమతౌల్యం సాధించారు.
మూడవ కారణం సరఫరా వ్యవస్థను సులభతరం చేయడం. ఒకే ప్రమాణంలో సిలిండర్లను తయారు చేయడం వల్ల గ్యాస్ ఏజెన్సీలకు సరఫరా లెక్కలు సులభంగా నిర్వహించగలిగారు. వినియోగదారుల డిమాండ్‌ను అంచనా వేసి సరఫరాను సమర్థవంతంగా ప్లాన్ చేయడం వీలైంది. ఈ విధానం సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతూ గ్యాస్ పంపిణీ వ్యవస్థను స్థిరంగా నిలబెట్టింది. ఇదే కారణంగా 5 కిలోల చిన్న సిలిండర్ కూడా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒంటరి వ్యక్తులు లేదా చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది.
ఇలా చూస్తే.. 14.2 కిలోల గ్యాస్ అనేది యాదృచ్ఛికంగా తీసుకున్న సంఖ్య కాదు. వినియోగదారుల సౌలభ్యం, భద్రత, ఖర్చు, సరఫరా వ్యవస్థ వంటి అనేక అంశాలను సమతుల్యం చేస్తూ తీసుకున్న శాస్త్రీయ నిర్ణయం. అందుకే ఇంతకాలంగా ఇదే ప్రమాణం కొనసాగుతోంది. ఇప్పుడు ఎల్పీజీ కొరత నేపథ్యంలో ఈ విషయాలు మళ్లీ చర్చకు వస్తుండగా, ఈ సంఖ్య వెనుక ఉన్న నిజమైన కారణాలు ప్రజలకు ఆసక్తికరంగా మారాయి.
ALSO READ: ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి (VIDEO)
