
తెలుగు సినిమా రంగానికి ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన నంది అవార్డులు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చర్చకు వచ్చాయి. చివరిసారిగా 2017లో మూడు సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించి అందజేయగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ పాలనలో నంది అవార్డుల ప్రస్తావనే లేకపోవడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, మళ్లీ నంది అవార్డులను అందించేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం రావడంతో ఈ పురస్కారాలపై విస్తృత స్థాయిలో చర్చ ప్రారంభమైంది.
నంది అవార్డులకు తెలుగు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1964లో లేపాక్షి నంది పేరిట ఈ అవార్డులను ప్రారంభించగా, అప్పటి నుంచి తెలుగు సినిమా, కళా రంగానికి అవి ఒక ప్రతీకగా నిలిచాయి. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పురస్కారాలను అందజేస్తూ వచ్చారు. 2016 వరకు విడుదలైన చిత్రాలకు, వాటిలో నటించిన కళాకారులకు నంది అవార్డులు అందించగా, ఆ తర్వాత ఈ సంప్రదాయం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ అవార్డుల పునరాగమనం జరిగే అవకాశముండటంతో గతంలో ఎవరు ఎంతమంది నంది అవార్డులు గెలుచుకున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ చరిత్రలో ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్న హీరోల జాబితా చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలిగే నిజాలు బయటపడతాయి. మొత్తం మీద 20 మంది హీరోలకు నంది అవార్డులు దక్కగా, అందులో అత్యధిక సార్లు ఈ గౌరవాన్ని అందుకున్న హీరోగా విక్టరీ వెంకటేష్ రికార్డు సృష్టించారు. ఆయన ఏకంగా ఐదుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో నాలుగు నందులతో మహేశ్ బాబు నిలిచారు. కమల్ హాసన్, జగపతి బాబు, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ ముగ్గురేసి సార్లు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ప్రభాకర రెడ్డి, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావు రెండేసి సార్లు నంది అవార్డులు అందుకున్నారు. హేమ సుందర్, గోకిన రామారావు, సుమన్, మురళీమోహన్, రవితేజ, నేచురల్ స్టార్ నాని, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కోసారి నంది అవార్డు పొందారు. ఇందులో 1993లో సుమన్, జగపతి బాబులకు సంయుక్తంగా నంది అవార్డు లభించడం విశేషంగా నిలిచింది.
విక్టరీ వెంకటేష్ నంది ప్రయాణం 1988లో విడుదలైన ‘ప్రేమ’ సినిమాతో ప్రారంభమైంది. ఆ చిత్రంలో ఆయన నటనకు తొలి నంది అవార్డు దక్కింది. ఆ తర్వాత ‘ధర్మచక్రం’ (1995), ‘గణేష్’ (1998), ‘కలిసుందాం రా’ (1999), ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007) చిత్రాలకు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. మహేశ్ బాబు విషయానికొస్తే ‘నిజం’ (2003), ‘అతడు’ (2005), ‘దూకుడు’ (2011), ‘శ్రీమంతుడు’ (2015) సినిమాల్లో ఉత్తమ నటుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు. కమల్ హాసన్ ‘సాగర సంగమం’ (1983), ‘స్వాతిముత్యం’ (1986), ‘ఇంద్రుడు చంద్రుడు’ (1989) సినిమాలతో నంది అవార్డులు అందుకున్నారు.
హీరోయిన్ల విభాగంలోనూ నంది అవార్డులకు విశేషమైన చరిత్ర ఉంది. మొత్తం 30 మంది హీరోయిన్లు నంది అవార్డులు అందుకోగా, వారిలో జయసుధ అత్యధికంగా ఐదుసార్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. విజయశాంతి నాలుగు సార్లు, సౌందర్య మూడు సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు. లక్ష్మి, ఆమని, లయ రెండేసి సార్లు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. జయసుధ ‘జ్యోతి’ (1975), ‘ఇది కథ కాదు’ (1979), ‘ప్రేమాభిషేకం’ (1981), ‘మేఘసందేశం’ (1982), ‘ధర్మాత్ముడు’ (1983) సినిమాల్లో నటనకు ఐదుసార్లు ఉత్తమ నటి అవార్డులు పొందారు.
విజయశాంతి ‘ప్రతిఘటన’ (1985), ‘భారతనారి’ (1989), ‘కర్తవ్యం’ (1990), ‘ఒసేయ్ రాములమ్మ’ (1997) సినిమాలతో నాలుగు నంది అవార్డులు అందుకోగా, సౌందర్య ‘అమ్మోరు’ (1994), ‘పవిత్ర బంధం’ (1996), ‘అంతఃపురం’ (1998) సినిమాలతో మూడు నందులు గెలుచుకున్నారు. జయప్రద, రూప, తెలంగాణ శకుంతల, సుహాసిని, సుమలత, భానుప్రియ, శ్రీదేవి, మీనా, మహేశ్వరి, కల్యాణి, భూమిక చావ్లా, కమలినీ ముఖర్జీ, త్రిష, నందితా దాస్, ఛార్మి కౌర్, స్వాతి రెడ్డి, తీర్థ, నిత్యా మీనన్, నయనతార, సమంత రూత్ ప్రభు, అంజలి పాటిల్, అంజలి, అనుష్క శెట్టి, రీతు వర్మ ఒక్కోసారి నంది అవార్డులు అందుకున్నారు. మళ్లీ నంది అవార్డులు అందించే ప్రక్రియ మొదలైతే, తెలుగు సినిమా చరిత్రలోని ఈ ఘనతలు మరోసారి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ: Ride Services: క్యాబ్స్ లో వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఇవాళ ఆ సర్వీసులు ఉండవట!





