
భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన విశాల దేశం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలు అమలులో ఉంటాయి. సాధారణంగా పండగలు, పూజలు, ఉపవాసాల సమయంలో భక్తులు సాత్వికమైన శాఖాహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆలయ దర్శనాల వేళ మాంసాహారం తీసుకోకూడదన్న భావన కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భిన్నమైన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. అక్కడ దేవీదేవతలకు మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది. ఈ సంప్రదాయాల వెనుక మతపరమైన విశ్వాసాలు, స్థానిక సంస్కృతి, చారిత్రక నేపథ్యం దాగి ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునియాండి స్వామి ఆలయం ఈ తరహా సంప్రదాయాలకు ప్రసిద్ధి. మునియాండి స్వామిని శివుని అవతారంగా భక్తులు కొలుస్తారు. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే వార్షిక ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయంలో చికెన్, మటన్ బిర్యానీని ప్రసాదంగా అందించడం విశేషం. బిర్యానీ ప్రసాదం పొందేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ స్థానికుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ జగన్నాథ ఆలయ సముదాయంలో ఉన్న విమల లేదా బిమల దేవి ఆలయం ఒక ముఖ్యమైన శక్తిపీఠం. దుర్గాపూజ సమయంలో అమ్మవారికి మాంసం, చేపలతో నైవేద్యం సమర్పించే ప్రత్యేక ఆచారం ఇక్కడ ఉంది. ఆలయ పరిధిలోని పవిత్ర మార్కండ సరస్సులో పట్టిన చేపలను వండి నైవేద్యంగా పెడతారు. అలాగే మేకను బలి ఇచ్చి దాని మాంసాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలు జగన్నాథ ఆలయ తలుపులు మూసివున్న సమయంలోనే నిర్వహిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఉన్న తార్కుల్లా దేవి ఆలయం భక్తుల కోరికలు తీరుస్తుందనే నమ్మకంతో ప్రసిద్ధి చెందింది. చైత్ర నవరాత్రుల సందర్భంగా ఇక్కడ కిచ్డి మేళా నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లిస్తారు. మేకలను బలి ఇచ్చి వాటి మాంసాన్ని మట్టి కుండల్లో వండి, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
కేరళలోని పార్సినిక్ కడవు దేవాలయం ముత్తప్పన్‌కు అంకితం. ముత్తప్పన్‌ను విష్ణు, శివుల సమ్మిళిత అవతారంగా భావిస్తారు. ఇక్కడ కాల్చిన చేపలు, కల్లు వంటి నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ నైవేద్యాల వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. పూజ అనంతరం అదే ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.
పశ్చిమ బెంగాల్‌లోని కాళీఘాట్ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేకలను బలి ఇస్తారు. బలి అనంతరం ఆ మాంసాన్ని వండి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇది అక్కడి సంప్రదాయంలో అంతర్భాగంగా కొనసాగుతోంది.
అస్సాంలోని నీలాచల్ పర్వతాలపై ఉన్న కామాఖ్య ఆలయం ప్రసిద్ధ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారికి శాఖాహారంతో పాటు మాంసాహార నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. అయితే, ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంటకాలను సిద్ధం చేస్తారు. మేక మాంసం, చేపల చట్నీని మధ్యాహ్నం వేళల్లో అమ్మవారికి నివేదిస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం మూసివేస్తారు.
పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠ్ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ మాంసంతో పాటు మద్యం కూడా నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. పూజ అనంతరం భక్తులకు అదే ప్రసాదంగా అందజేస్తారు.
దక్షిణేశ్వర్ కాళీ ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని మరో ప్రముఖ శక్తిపీఠం. ఈ ఆలయంలో దేవతకు చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, ఇక్కడ జంతుబలులు ఉండవు. చేపల ప్రసాదాన్ని మాత్రమే భక్తులకు పంపిణీ చేస్తారు.
ఈ ఆలయాలు భారతదేశంలోని భక్తి సంప్రదాయాల వైవిధ్యానికి నిదర్శనం. సాత్విక పూజలతో పాటు, స్థానిక విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన మాంసాహార నైవేద్యాల ఆచారాలు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తున్నాయి.
ALSO READ: 20 రోజులుగా ఇంట్లోనే 50 కుక్కలు.. తలుపులు తెరిచి చూడగా షాక్





