
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు సామాన్యుడిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజురోజుకూ అన్ని రకాల కూరగాయల రేట్లు రూ.100 మార్క్‌ను దాటుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కూరగాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమేనని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత పెరిగి, అది నేరుగా కూరగాయల సాగుపై ప్రభావం చూపుతోంది.
చలికాలం ప్రభావంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో పంటలు సరిగా ఎదగడం లేదని చెబుతున్నారు. ఆకులపై ఎక్కువసేపు మంచు పేరుకుపోవడంతో కూరగాయల మొక్కలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా పిందె దశలోనే కూరగాయలు కింద పడిపోతున్నాయని రైతులు అంటున్నారు.
ఈ పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చలి కారణంగా టమోటా పంటపై ఎక్కువ ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. టమోటా చెట్ల ఆకులు నల్లబడి పూత రాలిపోవడంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్‌లో టమోటాకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, ధరలు కూడా భారీగా పెరిగాయి.
టమోటాతో పాటు బీరకాయ, బెండ, కాకారకాయ, పచ్చి మిర్చి వంటి కూరగాయల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని రైతులు తెలిపారు. చలితీవ్రత వల్ల మొక్కలు బలహీనమై, కూరగాయలు పూర్తిగా ఎదగకముందే రాలిపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు వచ్చే సరఫరా తగ్గిపోయి, లభ్యత తక్కువగా మారింది. సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. గతంలో రూ.200 తో వారం రోజుల పాటు సరిపడే కూరగాయలు కొనుగోలు చేసేవాళ్లమని, ఇప్పుడు అదే మొత్తంతో రెండు రోజులకూ సరిపోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండే టమోటా, ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరగడంతో ఏ కూరగాయ కొనాలనే దానిపై అయోమయంలో పడుతున్నామని చెబుతున్నారు.
ఇలా చలితీవ్రత ఒకవైపు రైతులను నష్టపరుస్తుండగా, మరోవైపు వినియోగదారుల జేబులపై భారంగా మారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిపై దృష్టి సారించి రైతులకు, వినియోగదారులకు ఊరట కల్పించే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ALSO READ: మార్చి నుండి రూ.500 నోట్లు నిలిచిపోతాయా?





