
మనలో చాలామందికి తెలియకుండానే ఏర్పడే అలవాట్లలో గోళ్లు కొరకడం ఒకటి. టెన్షన్ పెరిగినప్పుడు, లోతైన ఆలోచనల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా కూర్చున్న వేళల్లో గోళ్లు కొరికేస్తూ ఉండటం చాలా సాధారణంగా మారిపోయింది. నెయిల్ కట్టర్ ఇంట్లో ఉన్నా సరే.. గోళ్లు పెరిగిన వెంటనే వాటిని కొరికి ఊసేయడం చాలామందిలో కనిపించే అలవాటు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య ఎవరికైనా ఉండొచ్చు. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు కానీ వైద్యపరంగా ఇది ఒనికోఫాగియా అనే ఒక రకమైన ఫోబియాగా గుర్తించబడింది.
గోళ్లు కొరకడంలో ఏముందిలే అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల చిన్నచిన్న ఇన్ఫెక్షన్ల నుంచి తీవ్రమైన దంత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులకు ఇది కారణమవుతుందని చెబుతున్నారు.
మన చేతులపై ప్రతిరోజూ కంటికి కనిపించని వేలాది సూక్ష్మక్రిములు ఉంటాయి. మనం గోళ్లు కొరికే సమయంలో ఈ బ్యాక్టీరియా, వైరస్‌లు నేరుగా నోటిలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అవి జీర్ణవ్యవస్థలోకి వెళ్లి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా తరచూ గోళ్లు కొరికే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
గోళ్లు కొరకడం వల్ల దంతాలు, చిగుళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పదేపదే గోళ్లు కొరికే సమయంలో దంతాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల దవడ నొప్పి, పళ్ల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, కావిటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు ఏర్పడి రక్తస్రావం కూడా జరగవచ్చు.
నిరంతరం గోళ్లు కొరికే అలవాటు గోర్లు, వాటి చుట్టూ ఉండే చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది. గోర్లు చాలా చిన్నగా మారడమే కాకుండా, చర్మం పగిలిపోవడం, రక్తం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో గోరు ఆకారం పూర్తిగా మారిపోవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో గోళ్లు మళ్లీ సరిగ్గా పెరగకపోవడం లేదా శాశ్వతంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ అలవాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఒత్తిడి, ఆందోళన, విసుగు లేదా భయం ఉన్నప్పుడు గోళ్లను కొరుకుతారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగా అనిపించినా.. దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. కొందరిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, అసహన భావాలు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
అయితే ఈ అలవాటును పూర్తిగా మానేయడం అసాధ్యం కాదు. ముందుగా గోళ్లను కొరకకుండా కంట్రోల్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. గోళ్లను ఎప్పటికప్పుడు చక్కగా కత్తిరించుకోవాలి. నెయిల్ పాలిష్ లేదా బిట్టర్ టేస్ట్ నెయిల్ కోటింగ్ వాడితే గోళ్లు కొరకాలన్న కోరిక తగ్గుతుంది. టెన్షన్ వచ్చినప్పుడు గోళ్లు కాకుండా వేరే దృష్టి మళ్లించే అలవాట్లు పెంచుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల సలహా కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ALSO READ: Curd: మీరు పెరుగు తింటున్నారా?





