
DMKs Tiruchi Siva: ఉపరాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన బలం లేకపోయినప్పటికీ ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచీ శివను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన ఎన్టీయే కూటమి
అటు ఇప్పటికే అధికార ఎన్డీయే కూటమి ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది. తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే వేసిన ఈ ఎత్తుకు ఇండియా కూటమి పై ఎత్తును వేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివ పేరు తెరపైకి వచ్చింది. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంతో ప్రాంతీయంగా తలెత్తే రాజకీయ సమస్యను దీనివల్ల అధిగమించవచ్చునని ఇండియా కూటమి భావిస్తోంది. అలాగే.. తమిళనాడుకు చెందిన నేతను ఎంపిక చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి అదనపు మద్దతు పొందవచ్చుననేది ఒక ఆలోచన. బీజేపీయా మరొకటా అనేది పక్కనపెడితే తమిళనాడు నుంచి ఒకరు ఉపరాష్ట్రపతి అవుతున్నారంటే.. డీఎంకే సైతం వ్యతిరేకించడానికి ఉండదు. అదేగనుక తమ పార్టీ నేతే పోటీకి నిలబడితే ఈ సమస్య తలెత్తదని డీఎంకే, ఇతర విపక్ష పార్టీలు ఆలోచించినట్టు తెలిసింది.
రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం విషయంలో డీఎంకేలో చీలిక
మరోవైపు, రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం విషయంలో తమిళనాడులోని అధికార డీఎంకే కూటమిలో చీలిక తలెత్తింది. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే ఇప్పటికే తేల్చేయగా, భాగస్వామ్య పక్షం ఎమ్‌డీఎంకే మాత్రం రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపింది.